Supremecourt on MLC Kavitha Petition : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కవిత పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు సుప్రీం ట్యాగ్ చేసింది. ఈడీ ఆఫీస్‌కు మహిళలను పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో న్యాయస్థానంలో నళినీ పిటిషన్ వేశారు. ఎమ్మెల్సీ కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. జస్టిస్ అజయ్‌రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈడీ, ఎమ్మెల్సీ కవిత తరఫున వాదనలు విన్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సాఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్‌రామచంద్రపిళ్లై, ప్రేమ్ రాహుల్‌లు సౌత్‌గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి దిల్లీ లిక్కర్ విధానాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగం. ఇదే విషయంపై ఈ నెల 11న ఎమ్మెల్సీ కవితను తొలిసారి ఈడీ దాదాపు సుదీర్ఘంగా 8 గంటలపాటు ప్రశ్నించింది. మళ్లీ మార్చి 16న హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. మహిళలను చట్టప్రకారం వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ చేస్తూ ఈ నెల 14న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.