తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Chandrababu Quash Petition adjourned in SC : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్‌ 3కు వాయిదావేసిన సుప్రీం కోర్టు - చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌

CBN Petition in SC
CBN Petition in SC

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 3:53 PM IST

Updated : Sep 27, 2023, 10:13 PM IST

14:46 September 27

CBN Petition in SC సీజేఐ ముందు మళ్లీ మెన్షన్‌ చేసిన సిద్ధార్థ లూథ్రా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్‌ 3కు వాయిదా పడింది. తొలుత ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి... విముఖత చూపారు. వెంటనే చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా... సీజేఐ ఎదుట మెన్షన్‌ చేసి వెంటనే జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. కేసులోని అంశాలను పరిశీలించాల్సి ఉన్నందున... అక్టోబర్‌ 3న విచారణ జరుపుతామని సీజేఐ స్పష్టం చేశారు.

స్కిల్‌ కేసులో తన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌... సుప్రీంకోర్టులో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్. భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి గతంలో ఏపీ హైకోర్టులో పనిచేసినందున... ఈ కేసు విచారణలో తనకు కొంత ఇబ్బంది ఉంటుందని... అందుకే ధర్మాసనం నుంచి తాను తప్పుకోవడం లేదా వేరే బెంచ్‌కు పిటిషన్‌ను బదిలీ చేయాలని చెప్పారు. అదే విషయాన్ని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా చంద్రబాబు తరపు న్యాయవాదులకు స్పష్టంచేశారు. కానీ చంద్రబాబు తరపు న్యాయవాదులు తాము ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు మెన్షన్‌ చేసేందుకు అవకాశం కల్పించాలని... అప్పటివరకూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. అందుకు జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా సమ్మతించారు.

Indian Association of Lawyers Protest in Vijayawada: ఇండియన్ అసోషియేషన్ ఆఫ్‌ లాయర్స్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..

తర్వాత ప్రధాన న్యాయమూర్తి ఎదుట న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీలో ప్రతిపక్షాల పట్ల, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు ఈ కేసును నిదర్శనంగా చెప్పుకోవచ్చన్నారు. జడ్ కేటగిరీ, ఎన్ఎస్​జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్టు చేయడంతో పాటు 24 గంటలపాటు హింసించి... చివరి నిమిషంలో కోర్టులో హాజరు పరిచారన్నారు. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని వివరించారు. ఏపీలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటూ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. కేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారం అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ తో ముడిపడి ఉందని... ఆ విషయాన్ని పక్కనబెట్టి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్టు చేశారన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వారంతా బెయిల్‌పై బయట ఉన్నారన్నారు. చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.కక్షపూరితంగానే ఇదంతా చేస్తున్నారని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్ చేయాలన్నది తమ మొదటి అభ్యర్థన అని... ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది తమ రెండో అభ్యర్థన అని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. 17-ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీకి ఇవ్వకూడనటువంటి కేసని సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు.

Jana Chaitanya vedika on volunteer system: 'వార్డు సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధం.. వాలంటీర్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి విఘాతం'

చంద్రబాబుకు బెయిల్ కోరుకుంటున్నారా? అని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. ఈ కేసులో తాము బెయిల్ కోరుకోవడం లేదని సిద్ధార్థ్ లూథ్రా స్పష్టం చేశారు. జడ్ కేటగిరీ, ఎన్ఎస్​జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా? అని లూథ్రా ప్రశ్నించారు. ఇది పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని.. యశ్వంత్ సిన్హా కేసును ప్రస్తావించారు. ఈ కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారని లూథ్రా తెలిపారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని... చంద్రబాబుకు ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో సీఐడీ తరఫు న్యాయవాది రంజిత్‌ కుమార్‌ పదే పదే అడ్డుతగలడంతో ... కొంత సంయమనం పాటించాలని సీజేఐ సూచించారు. రకరకాల అంశాలను రంజిత్‌కుమార్‌ సీజేఐ ఎదుట ప్రస్తావించే ప్రయత్నం చేయగా... ప్రస్తుతం కేసు వివరాల్లోకి తాము వెళ్లడం లేదని సీజేఐ అన్నారు. తాము ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూలంకషంగా చర్చించాల్సి ఉంది కాబట్టి... అనవసర విషయాల జోలికి పోదలచుకోలేదన్నారు. కేసుకు సంబంధించిన అన్నింటిపైనా వచ్చే మంగళవారం విచారణ జరుపుతామన్నారు. అప్పటివరకూ కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు.

అత్యంత భద్రత ఉన్న వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాబట్టి... వెంటనే నిర్ణయం తీసుకోవాలని సిద్ధార్థ్ లూథ్రా కోరినప్పటికీ... కేసుకు సంబంధించిన వివరాలన్నీ పరిశీలించాలని... బెంచ్‌లో ఉన్న మిగతా ఇద్దరు న్యాయమూర్తుతో సంప్రదింపులు జరిపిన తర్వాత... అక్టోబర్ 3న తగిన ఆదేశాలు ఇస్తామని సీజేఐ స్పష్టం చేశారు. ఈ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ.. పోలీస్ కస్టడీ అడుగుతోందని.. దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని సిద్ధార్థ్ లూథ్రా కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ... ట్రయల్ కోర్టు జడ్జిని సంయమనం పాటించాలని చెప్పలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేశారు.


Capital Farmers Protest Against CM Jagan: రాజధాని రైతుల నుంచి సీఎంకు నిరసన సెగ.. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు...

Last Updated : Sep 27, 2023, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details