గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు తాను బాధ్యుడిని కానని పంజాబీ నటుడు దీప్ సిద్ధూ పేర్కొన్నారు. ట్రాక్టర్ ర్యాలీని ఎర్రకోట వైపు తాను మళ్లించలేదని చెప్పారు. ఆందోళనకు రైతు నేతలే పిలుపునిచ్చారని, తాను ఏ రైతు సంఘంలోనూ సభ్యుడిని కానని దిల్లీ కోర్టుకు తెలిపారు దీప్ సిద్ధూ.
ఈ మేరకు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు ఆయన తరఫు న్యాయవాది.
" నేను ఏ ఒక్క హింసాత్మక చర్యల్లో కూడా పాల్గొనలేదు. హింస చెలరేగడానికి ముందే నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. వీడియో మాత్రమే నేను పోస్టు చేశాను. అది నా పొరపాటే. ప్రతి పొరపాటు నేరం కాదు. నేను వీడియో పోస్టు చేసినందుకు.. మీడియా నన్ను నిందితునిగా చూపెట్టింది. అన్ని మీడియాల్లో నన్నే ప్రధాన కుట్రదారుగా చూపించారు. ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు."