'అరుదైన వ్యాధుల జాతీయ విధానం-2021'కు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఆమోదం తెలిపారు. అరుదైన వ్యాధుల చికిత్స వ్యయాన్ని తగ్గించటం, దేశీయ పరిశోధన, స్థానికంగా ఔషధాల ఉత్పత్తిపై దృష్టిసారించే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఒక్కసారి చికిత్స అవసరమైన అరుదైన వ్యాధుల కోసం రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేలా నియమాలు రూపొందించారు. ముఖ్యంగా అరుదైన వ్యాధుల విధానంలోని గ్రూప్-1 జాబితాలో ఉన్న వ్యాధులకు ఈ సాయం అందిస్తారు.
" ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులు కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే పరిమితం కాదు, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు అర్హులైన 40 శాతం మందికీ అందనుంది. అరుదైన వ్యాధుల చికిత్సల కోసం అందించే ఆర్థిక సాయం రాష్ట్రీయ ఆరోగ్య నిధి ద్వారా లభిస్తుంది. కానీ, ఆయుష్మాన్ భారత్ కిందకు రాదు. అలాగే.. క్రౌడ్ఫండింగ్ను సైతం ప్రోత్సహిస్తోంది. కార్పొరేట్లు, వ్యక్తిగతంగా.. ఐటీ ప్లాట్ఫాం ద్వారా ఆర్థిక సాయం చేయవచ్చు. ఈ నిధులు మూడు కేటగిరీలుగా తేల్చిన వ్యాధుల కోసం ఖర్చు చేస్తాం. జాతీయ పాలసీకి మార్చి 30న ఆమోదం తెలిపారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ "