కొవిడ్ ఇంకా ముగియలేదని, అప్రమత్తంగా ఉంటూ నిఘాను మరింత పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులందరికీ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మాండవీయ నేతృత్వంలో బుధవారం దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఐసీఎంఆర్, ఆయుష్, ఔషధ, బయో టెక్నాలజీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
"కొన్ని దేశాల్లో పెరుగుతున్న కొవిడ్-19 కేసుల దృష్ట్యా, నిపుణులు, అధికారులతో ఈరోజు పరిస్థితిని సమీక్షించాం. కొవిడ్ దశ ఇంకా ముగియలేదు. అప్రమత్తంగా ఉండి.. నిఘాను పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులందరినీ ఆదేశించాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని కేంద్ర ఆరోగ్య మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ముందస్తు చర్యలు ద్వారా కొత్త వేరియంట్‌లను గుర్తించి ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉత్పన్నమవుతున్న కొవిడ్ కొత్త వేరియంట్లపై అధికారులు సమీక్షలో చర్చించారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు రూపొందించే అవకాశముంది. పలుదేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. వైరస్ కొత్త వేరియంట్‌లను ఎప్పటికప్పుడు గుర్తించడానికి పాజిటివ్ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. కొవిడ్ పాజిటివ్‌గా తేలిన నమూనాలను ప్రతి రోజు సార్స్ కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియం పరీక్షా కేంద్రాలకు పంపించాలని కోరారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. క్రియాశీల కేసులు 4వేల దిగువనే ఉన్నాయి.