తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వ్యాప్తిపై కేంద్రం అలర్ట్.. మహాలో కేసులు 60% జంప్! - maharastra covid cases

MANSUKH MANDAVIYA COVID REVIEW: దేశంలో కరోనా వ్యాప్తిపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ. కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసుల్లో 60 శాతం పెరుగుదల నమోదైంది.

mansukh mandaviya covid meeting
మన్​సుఖ్ మాండవీయ

By

Published : Jun 23, 2022, 10:42 PM IST

MANSUKH MANDAVIYA COVID REVIEW: మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే 60 శాతం అధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 3260 కేసులు నమోదు కాగా.. గురువారం ఈ సంఖ్య 5218కి ఎగబాకింది. ముంబయిలోనే 2479 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో గురువారం కరోనాతో ఒకరు చనిపోయినట్లు వైద్య శాఖ నివేదికలో వెల్లడైంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులు, నిపుణులతో భేటీ అయ్యారు. పలు రాష్ట్రాల్లో వైరస్ కేసులు అధికంగా నమోదు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్న జిల్లాలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్​టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని స్పష్టం చేశారు.

వైరస్​పై పర్యవేక్షణ పెంచాలని, మ్యుటేషన్లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్​ నిర్వహించాలని సూచించారు. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్యపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని స్పష్టం చేశారు. అర్హులైన వారికి ప్రికాషన్ డోసులను అందించాలని సూచించారు. టీకాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని, వాటిని వృథా చేయకుండా పంపిణీ వేగాన్ని పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జూన్ 10 నుంచి 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతూ వస్తోంది. 51 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి నమోదవుతోంది. మరో 53 జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్య ఉందని అధికారులు తెలిపారు. మే, జూన్ మధ్య జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. 83 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్(బీఏ2) బయటపడిందని చెప్పారు.

ఇవీ చదవండి:దేశంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన మరణాలు

శిందే తిరుగుబాటు సక్సెస్.. బలంగా రెబల్ క్యాంప్.. ఠాక్రేకు ఛాన్స్ ఉందా?

ABOUT THE AUTHOR

...view details