కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్ ఉత్పత్తి పాంట్ల సామర్థ్యం పెంచడంతోపాటు తాత్కాలిక ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి యుద్ధవిమానాల ద్వారా ఆక్సిజన్‌ను తెప్పించుకుంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలెండర్ లేనప్పుడు నెబ్యులైజర్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆక్సిజన్ సిలిండర్ లేనప్పుడు దీనిని ఎలా ఉపయోగించుకోవాలో చెబుతూ డా. అలోక్ సేథి అనే మెడికల్ ప్రాక్టీషనర్ ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని చాలా మంది భావించి విపరీతంగా షేర్ చేసేశారు.. అయితే నెబ్యులైజర్ వాడటం మంచి పద్ధతి కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రత్యేక ద్రవం నుంచి ఆల్ట్రాసోనిక్ వైబ్రేషన్ ద్వారా ఆవిరిని మాత్రమే ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్తమా బాధితులకు ఊపిరి సరిగా ఆడనప్పుడు ఈ పరికరాన్ని ఉపయోగించి, వాయునాళంలో అవాంతరాలు తొలగించి ఊపిరాడేలా చేస్తారు. అంతేగాని దీనివల్ల ప్రత్యేకంగా ఆక్సిజన్ ఏమీ ఉత్పత్తి కాదని, తెలిసీతెలియక దీనిని ఉపయోగిస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుందని అంటున్నారు.