కర్ణాటకలోని మాండ్యలో అమానవీయ ఘటన జరిగింది. పాఠశాలకు మొబైల్ ఫోన్ తీసుకొచ్చిందనే కోపంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని దుస్తులు విప్పించింది ప్రధానోపాధ్యాయురాలు. అనంతరం కర్రతో చితకబాదింది. తోటి విద్యార్థుల ముందే ఈ దారుణం జరిగింది.
విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాయురాలు అమానవీయంగా ప్రవర్తించిన ఈ సంఘటన.. శ్రీరంగ పట్టణం తాలూకాలోని గణంగూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతవారం జరిగింది. తీవ్రంగా కొట్టటం సహా బాలురను తరగతి నుంచి బయటకు పంపించి.. దుస్తులు లేకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టింది.
ఏమాత్రం కనికరం లేకుండా..
మధ్యాహ్న భోజన సమయంలో తరగతి గదికి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు.. మొబైల్ ఫోన్ తీసుకొచ్చినవారు తనకు ఇచ్చేయాలని అడిగారని బాధితురాలు తెలిపింది. ఫోన్ ఇవ్వకుంటే బట్టలు విప్పించి బాలురతో తనిఖీ చేయిస్తానని బాలికలను హెచ్చరించినట్లు పేర్కొంది. కొద్ది సమయం తర్వాత బాలురను బయటకు పంపించి.. బట్టలు విప్పించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్ తెచ్చినందుకు కర్తతో తీవ్రంగా కొట్టినట్లు తెలిపింది.
" మా స్నేహితుల ముందే నా దుస్తులు విప్పించి, కింద కూర్చోబెట్టింది. చలిగా ఉందని, దాహం వేస్తుందని చెప్పినా కనికరించలేదు. సాయంత్రం వరకు కూర్చోబెట్టింది. 4.30 గంటలకు మధ్యాహ్న భోజనం చేసేందుకు అనుమతించింది. ఆ తర్వాత 5 గంటలకు ఇంటికి వెళ్లాం."