తమిళనాడులోని చెంగల్పట్టులో సమాధిలో ఉన్న ఓ బాలిక మృతదేహం నుంచి తలను తొలగించిన ఘటన కలకలం రేపింది. సమాధి దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పోలీసులకు లభించాయి. బాలిక తలను ఉపయోగించి ఏమైనా క్షుద్ర పూజలు చేశారా? కేసును దారి మళ్లించేందుకు ఇలా ఎవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ జరిగింది..
చెంగల్పట్టులోని మధురాండగానికి చెందిన పాండ్యన్-నదియా దంపతుల కుమార్తె కృతిక. ఆమె అక్టోబరు 5న ఆరిమేడులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఆమెపై విద్యుత్ స్తంభం పడడం వల్ల తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన చికిత్స నిమిత్తం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ అక్టోబరు 14వ తేదీన కృతిక మృతి చెందింది. మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.