HD Kumaraswamy Health Condition :కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ జేడీఎస్ నాయకులు హెచ్డీ కుమారస్వామి ఆస్పత్రిలో చేరారు. అలసట, జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున్నే అత్యవసరంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బెంగళూరులోని జయనగర్.. అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కుమారు స్వామి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ సైతం విడుదల చేశాయి ఆసుపత్రి వర్గాలు.
Health Bulletin on HD Kumaraswamy :ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు. అలసట, బలహీనత కారణంగా బుధవారం ఉదయం 3.40 గంటల ప్రాంతంలో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వారు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై.. కుమారస్వామికి చికిత్స చేసినట్లు వైద్యులు వివరించారు. ప్రస్తుతం కుమార స్వామి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి భయం అవసరం లేదని.. నిత్యం ఆయన్ను పర్యవేక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితమే కుమారస్వామికి మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. అనంతరం ఇలా అనారోగ్య బారిన పడటం వల్ల కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే సర్జరీకి, ఇప్పటి ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు నిర్ధరించడం వల్ల వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా వివిధ కార్యక్రమాల్లో విశ్రాంతి లేకుండా కుమారస్వామి గడిపారని.. అందుకే ఇలా జరిగి ఉండొచ్చని కార్యకర్తలు పేర్కొన్నారు.