తిహార్ జైలులో ఖైదీని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన షాక్‌కు గురిచేసిందని పేర్కొంది దిల్లీ హైకోర్టు. ఇలాంటివి కల్పిత కథల్లోనే జరుగుతాయని తెలిపింది. బాధితుడి తండ్రి రూ.5 కోట్లు పరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించిన పిటిషన్ విచారణ సందర్భంగా.. ' ఇలాంటివి ఎలా జరుగుతాయో నాకైతే తెలియదు. అది నన్ను షాక్‌కు గురిచేసింది. ఇలాంటివి కేవలం కల్పిత కథల్లోనే చూస్తాం.' అని జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ అన్నారు.
జైలు లోపల జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైందా? లేదా ? ఎఫ్ఐఆర్ నమోదైతే దర్యాప్తు స్థితి ఏమిటి? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని జైలు అధికారులు, దిల్లీ ప్రభుత్వ ప్రతినిధి, అదనపు స్టాండింగ్ కౌన్సెల్ సంజయ్ ఘోస్, న్యాయవాది నమన్ జైన్ సహా పోలీసులను ఆదేశించింది దిల్లీ కోర్టు. నివేదికలో.. బాధితుడిని ఉంచిన గది సీసీటీవీ దృశ్యాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏ విధంగా అనేది ఉండాలని స్పష్టం చేసింది. అలాగే.. ఈ ఘటనపై ఏదైనా ఛార్జ్‌షీట్ నమోదైందా? అయితే.. దాని స్థితిని తెలియజేయాలని ఆదేశించింది. వాటితో పాటు.. బాధితుడి తండ్రికి కేసు పురోగతి, దర్యాప్తుపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని తెలిపింది.
విచారణ సందర్భంగా.. ఇలాంటివి దేశ రాజధానిలో జరగటం తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయమని పేర్కొన్నారు ఘోస్. బాధితుడి శరీరంపై తొమ్మిది గాట్లు ఉన్నట్లు తెలిపారు.