వాట్సాప్ ప్రైవసీ వ్యవహారంపై తమ వైఖరిని తెలపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. మే 21 లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు అందించి.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జస్మీత్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం.
వాట్సాప్ 'ప్రైవసీ'పై సీసీఐకి హైకోర్టు నోటీసులు
నూతన ప్రైవసీ విధానాలపై విచారణ జరపొద్దంటూ దాఖలు చేసిన తమ పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాసనం కొట్టివేయడంపై వాట్సాప్, ఫేస్‌బుక్ ఇటీవలే దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ విషయంపై స్పందించాలంటూ తాజాగా సీసీఐకి నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ నెల 21లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
వాట్సాప్ గోప్యతా విధానంపై విచారణ చేపట్టాలని, 60 రోజుల్లోగా దీన్ని పూర్తిచేయాలంటూ మార్చి 24న సీసీఐ ఆదేశాలిచ్చింది. అనంతరం వీటిని ఫేస్‌బుక్, వాట్సాప్‌లు సవాలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం.. ఆయా పిటిషన్లను కొట్టి వేసింది. సీసీఐ ఆదేశాలను అడ్డుకునేందుకు.. పిటిషన్లో సరైన కారణాలేవి లేవవి పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టును ఫేస్‌బుక్, వాట్సాప్ ఆశ్రయించాయి. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. సీసీఐకి ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి:-బంగాల్ హింసపై కేంద్రం నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు