కరోనా టీకా పంపిణీ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో తెలుపుతూ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ప్రస్తుతం అవలంభిస్తున్న 60 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలు కలిగిన 45 ఏళ్లు మించిన వారికి అందిస్తున్న విధానంపై పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. అలాగే.. కొవిషీల్డ్, కొవాగ్జిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు టీకాలు అందించేందుకు మరింత సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్నట్లు కనిపించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టుల్లో పనిచేసే వారందరినీ ఫ్రంట్లైన్ వర్కర్లుగా భావించి వయసు, ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా టీకా వేయాలని.. బార్ కౌన్సిల్ ఆఫ్ దిల్లీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖాపల్లీతో కూడిన ధర్మాసనం.
"మనం పూర్తిస్థాయిలో వినియోగించుకోవటం లేదు. ఇతర దేశాలకు విరాళమివ్వటం లేదా విక్రయించటం చేస్తున్నాం. కానీ మన ప్రజలకు టీకా అందించటం లేదు. కాబట్టి బాధ్యత, అత్యవసర భావన కలిగి ఉండాలి. టీకాల సరఫరా సామర్థ్యాన్ని తెలుపుతూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలి. ప్రస్తుతం ఎంతవరకు ఉపయోగిస్తున్నారనేది తెలపాలి. టీకా పంపిణీకి అనుసరిస్తున్న విధానాలపై పూర్తి వివరాలు అందించాలి. "
- ధర్మాసనం.
హైకోర్టు ప్రశ్నలు
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం రోజు/వారం/ నెలల ప్రాతిపదికన తెలియజేస్తూ ప్రత్యేక ప్రమాణ పత్రం దాఖలు చేయాలని భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్లను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ప్రస్తుతం ఎంత మేర తయారు చేస్తున్నాం. ఇంకా ఎంత సామర్థ్యం ఉందనేది వివరించాలని సూచించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలమా లేదా చెప్పాలని స్పష్టం చేసింది.