సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాకు తగిన భద్రత ఇస్తామని హామీ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది బాంబే హైకోర్టు. కొవిషీల్డ్ సరఫరాపై పూనావాలకు బెదిరింపులు వస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు జెడ్-ప్లస్ భద్రత కల్పించాలని న్యాయవాది దత్తా మానె దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే లండన్ వెళ్లిన పూనావాలా భారత్కు తిరిగి వస్తే పటిష్ఠ భద్రత కల్పిస్తామని ప్రభుత్వంలోని ముఖ్య నేతలు హామీ ఇవ్వాలని వెల్లడించింది.
"టీకాల ఉత్పత్తితో పూనావాలా దేశానికి గొప్ప సేవ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి భద్రతా పరమైన ఆందోళన వ్యక్తం చేస్తే.. ప్రభుత్వం దానిని తప్పక పరిష్కరించాలి. హోం మంత్రి స్థాయిలో ఉన్న నేతలు ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడి భరోసా కల్పించాలి," అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వై కేటగిరీ భద్రత కల్పిస్తోంది. అయితే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారత్కు తిరిగొచ్చాక ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది దీపక్ ఠాక్రే కోర్టుకు తెలిపారు. పూనావాలాకు కల్పించిన భద్రతపై జూన్ 10న వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.