దేశంలో కొవిడ్-19 ఔషధాల కొరత ఉన్న సమయంలో రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న విషయంపై విచారణ చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్‌ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ మంచి ఉద్దేశంతో ఔషధాలు కొనుగోలు చేసి ఉంటారని, కానీ, అనాలోచితంగా తప్పు చేశారని వ్యాఖ్యానించింది. అలాగే.. ఆప్ ఎమ్మెల్యేలు ప్రీతి తోమర్, ప్రవీణ్ కుమార్‌పై ఆక్సిజన్ కొనుగోలు, నిల్వ చేయటంపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్‌ను ఆదేశించింది కోర్టు.
ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న సమయంలో రాజకీయ నేతలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయగలుగుతున్నారని, అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టింది జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ జస్మీత్ సింగ్‌తో కూడిన ధర్మాసనం. దిల్లీలో ఫాబిఫ్లూ వంటి ఔషధాల కొరత ఉన్నప్పటికీ ఓ వ్యక్తి ఏకంగా 2000 స్ట్రిప్స్ ఎలా కొనుగోలు చేయగలిగారని ప్రశ్నించింది. అలాంటి ప్రిస్క్రిప్షన్‌ను కెమిస్ట్ ఎలా అంగీకరిస్తున్నారని, ఈ అంశాన్నీ పరిశీలించాలని స్పష్టం చేసింది.
" గౌతమ్ గంభీర్ మంచి ఉద్దేశంతో అలా చేసి ఉండాలి. ఆయన ఉద్దేశాలను మేను అనుమానించటం లేదు. ఆయన జాతీయ క్రీడాకారుడు. ఔషధాల కొరత ఉన్నప్పుడు ఇది బాధ్యతాయుతమైన ప్రవర్తన అవుతుందా? అనేదే మా ప్రశ్న. ఆయన వెళ్లిన దారి సరైంది కాదనేది మా భావన. అది తప్పు అని అనుకొని ఉండరు. మార్కెట్ నుంచి ఎక్కువ మొత్తంలో ఔషధాలను ఈ విధంగా కొనుగోలు చేయటం సరికాదు. "
- దిల్లీ హైకోర్టు.