రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. రిజిస్టర్ చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పుడు రద్దు చేసే అధికారాన్ని కూడా ఇవ్వాలని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘానికి ఈ అధికారాన్ని ఇస్తే అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలను నిరోధించవచ్చని తెలిపింది.
కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే పార్టీలను రిజిస్టర్ చేస్తున్నారని అభిప్రాయపడింది ఈసీ. చాలా పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకుంటున్నాయి కానీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గుర్తు చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేటట్లు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను ఎన్నికల సంఘం కోరింది. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 50కి పైగా ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందాయి. 2,800 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి.