వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్న తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. అందుకోసం నిర్ణయాత్మక పోరాటం చేసేందుకే ఛలో దిల్లీకి పిలుపునిచ్చినట్లు పేర్కొన్నాయి. తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే కేంద్రం భారీ మూల్యం చెల్లించుకుంటుందని రైతు సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
"బేషరతు చర్చలపై ప్రభుత్వం మాట్లాడటం లేదు. కొన్నేళ్ల నుంచి మోదీ మనసులోని మాట(మన్‌కీ బాత్) వింటున్నాం. ఇవాళ దేశంలోని రైతులంతా తమ మనసులోని మాటను మోదీకి వినిపించేందుకు వచ్చారు. రైతుల మనసులోని మాట వినాలని మోదీని కోరాం. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తగిన గుణపాఠం తప్పదు. భాజపాకు, కేంద్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ గుర్తుంటుంది. అందుకోసం ఎంతకైనా రైతులు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు."
-రైతు సంఘాల ప్రతినిధి
ఐదు రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. తీవ్రంగా మారుతున్నాయి. సింఘు, టిక్రీ, ఘాజిపుర్ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియణా, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల రైతులు రోడ్లపై బైఠాయించారు. ఎముకలు కొరికే చలిలోనూ పోరాటం సాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం షరతులతో కూడిన చర్చలను వ్యతిరేకిస్తున్నట్లు తేల్చిచెప్పారు. నిరసనలను అణచివేసేందుకు రైతులపై ఇప్పటివరకు 31 కేసులు బనాయించారని రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చదునీ పేర్కొన్నారు.
అపోహలు వద్దు: భాజపా
మరోవైపు, నూతన వ్యవసాయ చట్టాలపై అపోహలు పడొద్దని రైతులకు సూచించారు భాజపా నేత, కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్. కనీస మద్దతు ధరతో వీటికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసినంత కాలం మండీ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పారు. నిరసనలకు దిల్లీ ప్రభుత్వం మద్దతు ప్రకటించడాన్ని తప్పుబట్టారు రవి శంకర్. రైతులను బడా కంపెనీలు దోచుకోకుండా ఉండేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని అన్నారు. ఎలాంటి పెనాల్టీ చెల్లించకుండానే ఒప్పందం నుంచి బయటకు వచ్చే రైతులకు ఉంటుందని చెప్పారు. పంటకు మద్దతు ధర వచ్చేందుకు ఈ చట్టాలు సహకరిస్తాయని ఉద్ఘాటించారు.
పంజాబ్ రైతులు గతేడాదితో పోలిస్తే ఇప్పుడే అధికంగా మండీలలో తమ పంటను విక్రయించారని మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఎంఎస్పీతో పోలిస్తే అధిక ధరకే పంటను అమ్ముకున్నారని చెప్పారు. ఎంఎస్పీ, మండీలతో పాటు ప్రభుత్వ కొనుగోళ్లు సైతం యథావిధిగా కొనసాగుతున్నట్లు వివరించారు.
'సూపర్‌స్ప్రెడర్' అవుతుందా?