ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసులో.. దోషికి ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సందీప్ సింగ్(20)కు జీవిత ఖైదు విధించింది. రూ.50వేల జరిమానా సైతం చెల్లించాలని ఆదేశించింది. ఐపీసీ, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 304 ప్రకారం సందీప్‌ను దోషిగా నిర్ధరించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి, రాము, లవ్కుశ్ను నిర్దోషులుగా ప్రకటించింది. గురువారం కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై తాము హైకోర్టుకు వెళ్తామన్నారు. "సందీప్‌పై అత్యాచార ఆరోపణలు రుజువు కాలేదు. ఈ తీర్పు కేవలం హత్యకు సంబంధించినదే. అతడు అమాయకడు. దీనిపై మేము హైకోర్టుకు వెళతాం." అని సందీప్ తరపు న్యాయవాది మున్నా సింగ్ అన్నారు.
కేసు వివరాలు..
సెప్టెంబర్ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని తొలుత యూపీ అలీగఢ్‌లోని జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ యువతి చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించింది.