విద్వేషపూరిత ప్రసంగాలు పూర్తిగా ప్రమాదకరంగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టీవీలు ప్రసారం చేసే వార్తలపై ఎలాంటి నియంత్రణ లేకుండాపోయిందని.. భారత్‌లో స్వేచ్ఛ, సమతుల్య మీడియా కావాలి అని పేర్కొంది. దేశవ్యాప్తంగా ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పలు పిటిషన్‌లపై జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
'విద్వేషపూరిత ప్రసంగాలతో ముప్పు.. TV ఛానెళ్లు హింసకు పాల్పడితే కఠిన చర్యలు' - free and balanced press in india supreme court
విద్వేషపూరిత ప్రసంగాలు ప్రమాదకరంగా మరాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాటిని ప్రసారం చేసే టీవీ ఛానళ్లపై మండిపడింది. అవి పూర్తిగా నియంత్రణ లేకుండా వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా యాజమాన్యాలను హెచ్చరించింది.
"ప్రస్తుతం ప్రతీది టీఆర్‌పీతో ముడిపడి ఉంది. టీవీ చానళ్లు ఒక దానితో మరొకటి పోటీ పడి సమాజంలో విభజన సృష్టిస్తున్నాయి. ఈ సమస్యకు ఒక టీవీ వ్యాఖ్యాతే కారణమైతే తొలగించడానికి ఏమి ఇబ్బంది?. పత్రికా రంగానికి ఉన్నట్లు వార్తా చానళ్లకు ఎందుకు ప్రెస్‌కౌన్సిల్ లేదు. మనకు వాక్ స్వాతంత్య్రం కావాలి. కానీ ఎంత మూల్యానికి" అని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఎయిర్ఇండియాలో మూత్రవిసర్జన ఘటనను బెంచ్ ప్రస్తావిస్తూ.. "ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంకా నిందితుడు మాత్రమే. అతడి పేరు మీడియాలో ప్రస్తావిస్తున్నారు. అతన్ని కించపరుస్తున్నారు. ప్రతి ఒక్కరికి పరువు అనేది ఉంటుంది. ప్రసారం అయ్యే కార్యక్రమంలో సుహృద్భావ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత టీవీ వ్యాఖ్యాతదే. ఆ బాధ్యత నెరవేర్చనప్పుడు వారిపై ఎన్ని సార్లు చర్యలు తీసుకోవాలి. మీడియాలో పనిచేసే వారు ఓ గొప్ప స్థానంలో ఉన్నారని గుర్తించాలి. సమాజంపై ప్రభావం చూపుతారని గమనించాలి. అంతేకాని వారే సమస్యగా మారొద్దు" అని తెలిపింది. ద్వేషపూరిత ప్రసంగాలు ప్రసారం చేస్తూ టీవీ చానళ్లు హింసకు పాల్పడితే.. యాజమాన్యంపై కఠిన చర్యలకు దిగాల్సి వస్తుందని జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. వార్తా వ్యాఖ్యాత, యాజమాన్యంపై కఠిన చర్యలకు దిగితే అందరూ దారిలోకి వస్తారని జస్టిస్ జోసెఫ్ ఘాటుగా స్పందించారు.