పెగసస్ వ్యవహారంలో మరోసారి కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు, దేశ ద్రోహులపై ప్రయోగించాల్సిన స్పైవేర్‌ను భారత్‌పై ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు. పెగసస్ వ్యవహారంలో విపక్షాలు అన్నీ.. ఒకతాటిపైకి వచ్చాయన్నారు. తాము పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నామని కేంద్రం చెబుతోందని.. కానీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పమనే అడుగుతున్నామని రాహుల్ స్పష్టం చేశారు. పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
" ప్రభుత్వం పెగసస్‌ను కొనుగోలు చేసిందా? లేదా? సొంత ప్రజలపైనే.. కేంద్రం పెగసస్ ఆయుధాన్ని ప్రయోగించిందా? ప్రధాని మోదీ.. మన ఫోన్లకు పెగసస్ ఆయుధాన్ని పంపారు. ఈ ఆయుధాన్ని నాతోపాటు , సుప్రీంకోర్టు, జర్నలిస్టులు ఇతర నాయకులపై ప్రయోగించారు. ఇంత జరిగినా కేంద్రం ఎందుకు ఈ విషయాన్ని సభలో ప్రస్తావించదు? ఇలాంటి ఆయుధాన్ని దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలపై ఎందుకు ప్రయోగించారో ప్రధాని, అమిత్ షా సమాధానం చెప్పాలి."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
మరోవైపు.. రైతు చట్టాలు, దేశభద్రత సమస్యలపై విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.