Haryana Violence News Today : హరియాణా నుహ్‌లో ఓ వర్గం నిర్వహించిన యాత్రను వేరొక వర్గానికి చెందిన యువత అడ్డుకోవడం వల్ల ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘటనలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఊరేగింపులో పాల్గొన్న వాహనాలకు అల్లరి మూకలు నిప్పంటించాయి.ఈ అల్లర్లలో ఇద్దరు హోం గార్డులు మృతి చెందారు. మరి కొంతమంది యువకులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఓ సంస్థ కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఈ అల్లర్లకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు శాంతి భద్రతలను నెలకొల్పేందుకు హరియాణా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో బుధవారం వరకు ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రోడ్లపై జనం గుమిగూడడాన్ని నిషేధించారు పోలీసులు. అల్లర్లలో నీరజ్ అనే ఓ హోం గార్డ్ చనిపోయినట్లు వారు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా సిబ్బందిని హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నట్లు హరియాణా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులతో అప్రమత్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. శాంతిని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.