Haryana Violence News : హరియాణాలో హింస చెలరేగిన నేపథ్యంలో నూహ్, గురుగ్రామ్‌లో పోలీసులు భద్రతను మరింత పెంచారు. మంగళవారం రాత్రి కూడా ఆందోళనకారులు.. గురుగ్రామ్ సెక్టార్ 70 ప్రాంతంలో దుకాణాలు, ఆశ్రమాలకు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే చిన్నచిన్న ఘటనలు మినహా పెద్దగా ఎలాంటి ఘటనలు జరగలేదని గురుగ్రామ్ పోలీసులు వివరించారు. గురుగ్రామ్‌లో ఆంక్షలు విధించిన పోలీసులు.. విడిగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపైనా నిషేధం విధించారు.
Haryana Violence Death Toll : ఇరువర్గాల ఘర్షణల్లో నూహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ఆరుగురు మృతిచెందినట్లు హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు హోం గార్డులు, నలుగురు పౌరులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 116 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఘర్షణలకు కారణమైన దోషులను వదిలే ప్రసక్తే లేదని ఖట్టర్ తేల్చిచెప్పారు. ప్రజల భద్రతే ముఖ్యమన్న సీఎం ఖట్టర్.. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని వివరించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హరియాణాలో 20 పారామిలటరీ బలగాలు, 30 రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించామని అన్నారు. భద్రతా ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉన్నాయని ఖట్టర్ తెలిపారు.