Haryana violence latest news in Telugu : హరియాణాలోని నూహ్ జిల్లాలో సోమవారం చెలరేగిన అల్లర్ల ప్రభావం పక్కనున్న గురుగ్రామ్‌పై పడింది. అర్ధరాత్రి సమయంలో సెక్టార్ 57లో ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారుల్లో.. కొందరు ఓ ప్రార్థనా మందిరంపై కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ ప్రాంతంలో నిప్పు పెట్టారని చెప్పారు. కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారని వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడించారు. తాజాగా గురుగ్రామ్‌లోని బాద్షాపుర్‌లో ఆందోళనలు చెలరేగాయి. ఒక రెస్టారెంట్, దుకాణానికి కొందరు నిప్పంటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నూహ్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇప్పటికే 13 కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకోగా.. మరో 6 కంపెనీల బృందాలను రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Haryana violence Nuh : ఓ వర్గం నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకునేందుకు మరో వర్గం వారు ప్రయత్నించడం వల్ల నూహ్ జిల్లాలో సోమవారం ఉద్రిక్తత తలెత్తింది. 120కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. వాటిలో 50కిపైగా వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 23 మందికి పైగా గాయపడ్డారు.
అల్లర్లలో దగ్ధమైన వాహనాలు Gurugram riots : నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఆయుధాలు, బుల్లెట్లు దొరకడం చూస్తుంటే దీని వెనక కుట్ర కోణం దాగి ఉంటుందని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ అనుమానం వ్యక్తంచేశారు. విచారణ తర్వాత బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పల్వాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఝజ్జర్ రేవారీ జిల్లాల నుంచి అదనపు బలగాలను నూహ్ జిల్లాకు పంపినట్లు చెప్పారు. నూహ్ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు మృతి చెందారని, పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని మంత్రి చెప్పారు. నల్హర్‌లోని వైద్య కళాశాలకు 15 మందిని తరలించగా... ఒకరు మృతి చెందారని తెలిపారు. తుపాకీ కాల్పుల్లో గాయపడిన ముగ్గురు పోలీసులు వెంటిలేటర్‌పై ఉన్నట్లు వివరించారు.
అల్లర్ల కారణంగా ఇవాళ నూహ్ సహా పలు చోట్ల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. హరియాణాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సోమవారం యాత్ర సందర్భంగా కొందరు కుట్ర పన్ని అల్లర్లు సృష్టించారనీ... విచారణ అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టంచేశారు.
ఘర్షణలు తలెత్తకుండా నూహ్, సోహ్నా జిల్లాల్లో రెండు వర్గాలకు చెందిన పెద్దలతో అధికారులు శాంతికమిటీలు ఏర్పాటుచేశారు. నూహ్ డిప్యూటీ కమీషనర్ ప్రశాంత్ పవార్, SP నరేంద్ర సింగ్ బిజార్నియా వీటికి అధ్యక్షత వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని ఇరువర్గాలను కోరారు. హింసాత్మక ఘటనలు చెలరేగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.