Haryana Robbery News :నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసి.. అతడి దగ్గర ఉన్న నగదును దోచుకున్నారునలుగురు దుండగులు. అనంతరం బాధితుడి జననాంగంపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ దారుణం హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బిహార్‌కు చెందిన ఓ యువకుడు(32) ఖండ్సా గ్రామంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రెస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బాధితుడు ఒంటరిగా తన ఇంటికి నడిచి వెళ్తున్నాడు. అప్పుడు మహ్మద్‌పుర్ రోడ్డులో ముసుగు ధరించిన నలుగురు దుండగులు అతడిపై దాడి చేశారు. డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. అందుకు బాధితుడు నిరాకరించడం వల్ల జేబులో ఉన్న డబ్బులను బలవంతంగా తీసుకున్నారు. వారి చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన బాధితుడిపై దారుణంగా ప్రవర్తించారు. పదునైన కత్తితో బాధితుడి జననాంగంపై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
'కొందరు దుండగులు ముసుగులో వచ్చి డబ్బులివ్వమని నన్ను అడిగారు. అందుకు నేను నిరాకరించాను. వారు నాపై దాడి చేసి.. జేబులో ఉన్న డబ్బుల్ని లాక్కున్నారు. అనంతరం అక్కడి నుంచి నేను పారిపోయేందుకు ప్రయత్నించగా.. నా ప్యాంట్ విప్పి జననాంగంపై దాడి చేశారు. వెంటనే నేను నొప్పితో కేకలు వేశాను. అప్పుడు వారందరూ పారిపోయారు. ఇంటికి వెళ్లి నా సోదరుడికి జరిగిందంతా చెప్పాను. వెంటనే అతడు నన్ను ఆస్పత్రికి తరలించాడు.' అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సెక్టార్-37 పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.