Haryana Road Accident : హరియాణాలో ఆర్టీసీ బస్సు - వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బీబీపుర్ గ్రామ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగింది ఇలా..
హరియణాలోని జింద్ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 9 గంటలకు జింద్ బస్టాండ్ నుంచి బయళ్దేరిన ఆర్టీసీ బస్సు.. బీబీపుర్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన క్రూయిజర్ (తుపాన్ ప్యాసింజర్ వాహనం)ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వ్యాన్ ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను క్రుయిజర్లో గుర్తించినట్లు సమాచారం. కాగా మృతులు అందరూ క్రుయిజర్లో ప్రయాణిస్తున్న వారే. బస్సు డ్రైవర్ సైతం ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఘటనా స్థలికి వెంటనే ఆరు అంబులెన్స్‌లు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించాయి.
గాయపడిన వారిలో ఆరుగురు రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరికి జింద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కాగా మృతుల్లో ఒక మహిళ ఉన్నట్లు గుర్తించామని స్థానిక పోలీసులు తెలిపారు.