సీఎం పర్యటనకు రైతుల సెగ- పోలీసుల లాఠీఛార్జ్ హరియాణాలో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై రాళ్లు రువ్వారు అన్నదాతలు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడం సహా.. బాష్పవాయువు ప్రయోగించారు.
ఏం జరిగిందంటే?
హిసార్, పాణిపట్ ప్రాంతాల్లో 500 పడకలు కలిగిన రెండు కొవిడ్ ఆస్పత్రులను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అక్కడికి వెళ్లారు. ఓ వైపు.. సీఎం ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండగా.. మరోవైపు రైతులంతా గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం.. ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్లిపోగా రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అన్నదాతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అంతకముందు రోజే.. హిసార్లో సీఎం పర్యటనను నిరసిస్తూ.. రైతు నాయకుడు ఓ వీడియోను విడుదల చేశారు. హిసార్లో జరిగే కొవిడ్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని అనుమతించవద్దని రైతులకు విజ్ఞప్తి చేసే దృశ్యాలు అందులో కనిపించాయి. ఆ సమయంలో మాయాద్ టోల్గేట్ వద్ద అన్నదాతలు ఏకమై సీఎం పర్యటనను అడ్డుకోవాలని ఆయన ఆ వీడియోలో సూచించారు.
ఇదీ చదవండి:'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'