తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Farmers protest: అన్నదాతలపై పోలీసుల లాఠీఛార్జి

సాగు చట్టాలపై నిరసనలు(Farmers protest) చేస్తున్న రైతులపై హరియాణా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆందోళనలు చేస్తున్న రైతులపై లాఠీఛార్జి(Lathi charge by Police) చేశారు. ఇందులో 10 మంది అన్నదాతలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రైతులు రక్తమోడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

farmer protest turns violent in Haryana
అన్నదాతలపై పోలీసుల లాఠీఛార్జి

By

Published : Aug 29, 2021, 6:48 AM IST

హరియాణాలో రైతులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడ్డారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలపై(Three Farm Laws ) నిరసన తెలిపేందుకు వెళ్తున్న వారిపై శనివారం లాఠీఛార్జి(Lathi charge by Police) చేశారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రైతులు రక్తమోడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి.

హరిణాయాలో రానున్న మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ పరంగా సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆధ్వర్యంలో శనివారం కర్నాల్‌లో భాజపా సమావేశం జరిగింది. ఈ సమావేశం వద్దకు వెళ్లి కేంద్ర సాగు చట్టాలపై నిరసన(Farmers Protest) తెలపాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) రైతులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కర్నాల్‌ బయలుదేరిన రైతుల్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కర్నాల్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద రైతులు రాస్తారోకోకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. అదే సమయంలో కర్నాల్‌ వెళ్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ ధన్‌కర్‌ వాహనశ్రేణిని రైతులు ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝులిపించారు. ఈ సందర్భంలోనే రైతుల తలలు పగులగొట్టడంటూ పోలీసులకు కర్నాల్‌ జిల్లా ఉన్నతాధికారి ఆయుష్‌ సిన్హా సూచనలిస్తున్న వీడియో విపరీతంగా వైరల్‌ అయింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించారని, రక్తం కారేలా కొట్టారని బీకేయూ మండిపడింది. అయితే 144 సెక్షన్‌ ఉన్నప్పటికీ రైతులు ఆందోళనకు దిగారని, ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకే స్వల్పస్థాయిలో బలప్రయోగం చేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆందోళనకారులు తమపైనా రాళ్లు రువ్వారన్నారు.

దేశానికి అవమానం: రాహుల్‌ గాంధీ

రైతులపై లాఠీఛార్జిని(Lathi charge by Police) కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. ఘటనా స్థలంలో రక్తమోడుతున్న రైతు ఫొటోను రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. రైతుల రక్తం చిందడంతో.. దేశం సిగ్గుతో తలదించుకుందని పేర్కొన్నారు. రైతులపై పడే ప్రతి దెబ్బ.. భాజపా శవపేటికలో మేకులా మారుతుందని ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరియాణాలో భాజపా-ఎల్‌జేపీ కూటమి పాలన జనరల్‌ డయ్యర్‌ ప్రభుత్వాన్ని తలపిస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా దుయ్యబట్టారు. పోలీసుల తీరు అమానవీయంగా ఉందని మాజీ సీఎం భూపేంద్ర సింగ్‌ హుడా అన్నారు. దీనిపై నిష్పాక్షిత దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హరియాణా పోలీసుల నిజస్వరూపం ఏమిటో ఈ లాఠీఛార్జితో బహిర్గతమైందని స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ విమర్శించారు. పోలీసుల చర్యను భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం ఖండించారు.

రాష్ట్రమంతా జాతీయ రహదారుల దిగ్బంధం

కర్నాల్‌ వద్ద జరిగిన లాఠీఛార్జిపై హరియాణా అంతటా ఆగ్రహం పెల్లుబికింది. పలు జిల్లాల్లో పెద్దసంఖ్యలో రైతులు జాతీయ రహదారులపైకి చేరి దిగ్బంధించారు. ఫలితంగా దిల్లీ, చండీగఢ్‌లకు వెళ్లే దారుల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఇదీ చూడండి:Farmers Protest: 'దేశవ్యాప్త ఉద్యమంగా రైతుల ఆందోళన'

ABOUT THE AUTHOR

...view details