తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణాలో 'ఆపరేషన్​ బుల్డోజర్'.. అల్లర్ల నిందితుల ఇళ్లను కూల్చేసిన అధికారులు - బుల్డోజర్లతో ఇళ్లు కూల్చిన అధికారులు

Haryana Nuh Violence : హరియాణాలోని నూహ్‌లో అల్లర్లలో పాల్గొన్న నిందితులను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్‌ నుంచి గత నాలుగేళ్లలో అక్రమంగా వలస వచ్చిన వారు ఆందోళనల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో చాలా మందికి చెందిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 4, 2023, 1:36 PM IST

అల్లర్ల నిందితుల ఇళ్లను కూల్చేసిన అధికారులు

Haryana Nuh Violence : హరియాణాలోని నూహ్‌ జిల్లాలో అల్లర్లకు కారణమైన నిందితులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నూహ్‌ జిల్లాలోని తావుడులో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను తొలగించారు. అక్రమంగా వలస వచ్చిన వీరు అల్లర్లలో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి గత నాలుగేళ్లలో వలస వచ్చిన వారు ఇక్కడ స్థలాలను కబ్జాచేసి ఈ పూరి గుడిసెలు నిర్మించినట్లు హరియాణా పట్టణాభివృద్ధి శాఖ అంటోంది. భారీ ఎత్తున పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

బుల్డోజర్లతో నిందితుల ఇళ్లను కూల్చేస్తున్న అధికారులు

Haryana Violence Updates : బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు రాళ్ల దాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. ఇదే విధమైన ఆపరేషన్‌ను నల్హార్‌ గ్రామంలో కూడా పోలీసులు చేపట్టారు. ఘర్షణల సమయంలో ఆందోళనకారులు ఈ గ్రామంలో భారీ సంఖ్యలో వాహనాలను దహనం చేశారు. నూహ్‌ అల్లర్ల వెనుక ఉన్న 50 మంది కుట్రధారులను పోలీసులు గుర్తించారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై స్థానిక అధికారులు 45 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు.

బుల్డోజర్లతో నిందితుల ఇళ్లను కూల్చేస్తున్న అధికారులు

నూహ్‌ అల్లర్లలో పాల్గొన్న వారిలో చాలా మంది విధ్వంసకారులు సమీపంలోని ఆరావళీ పర్వతాల్లో నక్కినట్లు ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టుల పర్వానికి తెరతీయడం వల్ల వాటిని తప్పించుకోవడానికి ఈ పర్వతాలపై ఉన్న చిన్నగ్రామాల్లోకి వారు చేరినట్లు తెలుస్తోంది. ఓ వర్గం ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన సమయంలో సెలవులో ఉన్న నూహ్‌ జిల్లా ఎస్​పీ వరుణ్‌ సింగ్లాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయన్ను భివాని ప్రాంతానికి బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఏడీజీపీ వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తున్న నరేంద్ర బిజ్రానియాను నూహ్‌ ఎస్​పీగా నియమించింది.

నూహ్ నుంచి బదిలీ అయిన ఎస్​పీ వరుణ్ సింగ్లా అల్లర్లపై స్పందించారు. నూహ్​లో అల్లర్లకు సంబంధించి 55 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. అలాగే 141 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. 'అల్లర్లపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గురువారం 19 మంది జ్యుడీషియల్ కస్టడీకి తరలించాము.' అని చెప్పారు.

మరోవైపు.. నూహ్ అల్లర్లు పానీపత్​ జిల్లాకు తాకాయి. గుర్తు తెలియని దుండగులు పానీపత్​లో ఓ చికెన్ షాపునకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఆ దుకాణం ఇటీవల నూహ్ అల్లర్ల మరణించిన వ్యక్తి ఇంటికి సమీపంలో ఉందని చెప్పారు. ఈ క్రమంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details