Haryana Nuh Security :హరియాణాలోని నూహ్‌లో మరోసారి ఉద్రిక్త వాతావారణ నెలకొంది. శోభాయాత్ర చేపట్టేందుకు అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ హిందూసంస్థలు సిద్ధమవుతుండటం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవలే అల్లర్లు జరిగిన నూహ్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ముందుజాగ్రత్త చర్యగా స్కూళ్లు, బ్యాంకులు మూసివేశారు. ప్రజలు ఎక్కడా గుమిగూడకుండా 144 సెక్షన్ విధించారు. మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలనూ పూర్తిగా నిలిపివేశారు.
Nuh Yatra Today : అయితే పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారాన్ని (ఉత్తరాది ప్రకారం) పురస్కరించుకుని పలు హిందూ సంస్థలు.. శోభాయాత్రకు పిలుపునిచ్చాయి. సెప్టెంబరు 3వ తేదీ నుంచి 7వే తేదీ వరకు జీ20 షెర్పా గ్రూప్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శోభాయాత్రకు అనుమతులు ఇవ్వలేమని అధికారులు.. హిందూ సంస్థలకు స్పష్టం చేశారు. అయినప్పటికీ శోభాయాత్రను నిర్వహించి తీరుతామని విశ్వహిందూ పరిషత్ తేల్చి చెప్పింది. దీంతో హరియాణా పోలీసులు అప్రమత్తమయ్యారు.
జిల్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Nuh Section 144 : పక్కా ప్రణాళికతో 30 కంపెనీల పారామిలిటరీ బలగాలనుపోలీసులురంగంలోకి దించారు. జిల్లా సరిహద్దుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు చేపట్టారు. నూహ్ వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఎక్కడికక్కడే బారికేడ్లను పెట్టారు. మిగతా జిల్లాల ఎవరికీ నూహ్‌లోకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దూకాణాలు తెరవద్దని స్థానికులకు సూచించారు. అంతే కాకుండా.. సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.
అయోధ్య సాధువుల అడ్డగింత..
Nuh Yatra VHP : మరోవైపు, నూహ్‌లోని నల్హత్ ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో పాల్గొనేందుకు అయోధ్య నుంచి కొంతమంది సాధువులు వచ్చారు. కానీ వారిని సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీంతో సాధువులు రోడ్డుపైనే బైఠాయించారు.