హరియాణాలో దారుణం జరిగింది. నుహ్‌లో అక్రమ మైనింగ్‌పై విచారణకు వెళ్లిన మేవాత్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌ని లారీతో ఢీకొట్టి హత్యచేశారు. పోలీసు అధికారిని ఢీకొట్టిన తర్వాత నిందితుడు పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
ఘటన జరిగిన గంటల వ్యవధిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడికి బుల్లెట్ గాయమైంది. అతడి కాలిలో తూటా దిగిందని హరియాణా డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు. మిగిలిన నిందితులను సైతం అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మైనింగ్ మాఫియాకు డీఎస్పీ బలి ఇదీ జరిగింది...
రాతి గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై డీఎస్పీ సురేంద్ర సింగ్ విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా తావడూ సమీపంలోని పంచగావ్ వద్ద ఉన్న ఆరావళి కొండల వద్ద అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లారు. దారిలో వెళ్తున్న ఓ లారీని ఆపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. అయితే, లారీ డ్రైవర్ ఇవేవీ పట్టించుకోకుండా పోలీసుపైకి వాహనాన్ని పోనిచ్చాడు.
మంగళవారం ఉదయం 11.50 గంటలకు ఈ ఘటన జరిగింది. డీఎస్పీ వెంట ఆయన గన్‌మన్, డ్రైవర్ ఉన్నారు. లారీ దూసుకొచ్చిన సమయంలో ఇరువురూ పక్కకు దూకేశారు. డీఎస్పీ తప్పించుకోలేకపోయారు. లారీ ఢీకొట్టిన వెంటనే డీఎస్పీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు వివరించారు.
ఏటా 50 ఫిర్యాదులు
నూహ్ జిల్లాలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా సాగిపోతోంది. అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు 2015 నుంచి ఏటా కనీసం 50 వరకు అందుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు, మాఫియా మధ్య భీకర ఘర్షణలు జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణను సైతం ప్రారంభించారు. అయితే, పోలీసులపైనే అక్రమార్కులు దాడి చేయడం సంచలనంగా మారింది.
కొద్ది నెలల్లో రిటైర్మెంట్.. ఆలోపే..
1994లో హరియాణా పోలీసు విభాగంలో చేరారు సురేంద్ర సింగ్ బిష్ణోయ్. అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన ఆయన.. క్రమంగా డీఎస్పీ స్థాయికి ఎదిగారు. హిసార్ జిల్లాలోని సారంగ్‌పుర్ ఆయన సొంత ఊరు కాగా.. ప్రస్తుతం కురుక్షేత్రలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. కొద్దినెలల్లో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఆలోపే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. డీఎస్పీ మృతిని ధ్రువీకరించిన హరియాణా పోలీసు విభాగం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. నిందితులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ఎంపీ ఫైర్
మరోవైపు, ఈ ఘటనను కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా తీవ్రంగా ఖండించారు. 'హరియాణాలో శాంతి భద్రతలు నశించాయి. నేరస్థులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మైనింగ్ మాఫియా, గ్యాంగ్స్టర్లు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలు ప్రారంభమయ్యాయి. గడిచిన 10రోజుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలకు హత్య బెదిరింపులు వచ్చాయి. ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. నిందితులను పట్టుకోలేకపోవడమే కాక.. ఎమ్మెల్యేలకు సురక్షిత వాతావరణాన్నీ కల్పించలేకపోతోంది. దీనికి సీఎం బాధ్యత వహించాలి. ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి' అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: