వ్యవసాయ చట్టాల వల్ల లాభాలను వివరించేందుకు తలెపెట్టిన కార్యక్రమంలో ఉద్రిక్తతలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. రైతులతో తమ ప్రభుత్వం ఒకరోజు ముందుగానే చర్చించిందని, శాంతియుత ప్రదర్శన చేపట్టేందుకు మాత్రమే అనుమతించిందని పేర్కొన్నారు. కానీ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారని, కొంత మంది యువకులు తమ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని అన్నారు.
ఏం జరిగిందంటే?
కర్నాల్ జిల్లా కైమ్లా గ్రామంలో ఖట్టర్ పాల్గొనాల్సిన కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సభకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సభవైపు వెళ్తున్న రైతులపై పోలీసులు బాష్పవాయువును, నీటి ఫిరంగులను ప్రయోగించారు. అయినా వెనక్కి తగ్గని రైతులు భద్రతా దళాలను ఛేదించుకొని వెళ్లి.. స్టేజీని ధ్వంసం చేశారు. కుర్చీలు, టేబుళ్లను విరగ్గొట్టారు. అనంతరం సీఎం హెలికాప్టర్ దిగాల్సిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలంలో బైఠాయించారు. దీంతో ముఖ్యమంత్రి తన సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్ హస్తం: ఖట్టర్
ఈ నేపథ్యంలో సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం ఖట్టర్.. ఈ పరిణామాలపై మాట్లాడారు. రైతులు, రైతు నేతలుగా చెప్పుకునే వారి అభిప్రాయాలను తాము ఎన్నడూ అడ్డు చెప్పలేదని ఖట్టర్ పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ వారి నిరసనలు కొనసాగేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ఉద్రిక్తతల వల్ల ప్రజలకు స్పష్టమైన సందేశం చేరిందని అన్నారు. నిరసనల వెనక కాంగ్రెస్, వామపక్షాల హస్తం ఉందని ఆరోపించారు.