Haryana Bulldozer Action : హరియాణాలోని నూహ్ జిల్లాలో ఘర్షణల అనంతరం అక్రమ నిర్మాణాలపై స్థానిక అధికార యంత్రాంగం.. ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలు అక్రమమంటూ బుల్డోజర్లతోకూల్చివేయించింది. తాజాగా రజా సహారా హోటల్‌ను కూల్చివేశారు. ఇటీవల ఘర్షణల సమయంలో దుండగులు అక్కడి నుంచే రాళ్లు విసిరారని జిల్లా యంత్రాంగం తెలిపింది. అది అక్రమంగా నిర్మించారని వెల్లడించింది.
'మహాపంచాయత్ ప్రశాంతంగా..'
Nuh Violence Update : అదే సమయంలో గురుగ్రామ్ సమీపంలోని టిఘర్ గ్రామంలో హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మహాపంచాయత్ జరుగుతున్న నేపథ్యంలో.. పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రెండు, మూడు రోజుల నుంచి గురుగ్రామ్ ప్రశాంతంగా ఉందన్న ఏసీపీ వికాస్ కౌశిక్.. మహాపంచాయత్ కూడా ప్రశాంతంగా సాగుతుందని భావిస్తున్నట్లు వివరించారు.
ఆగస్ట్ 8వ తేదీ వరకు నో ఇంటర్నెట్..
Nuh Internet Ban : నూహ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆగస్టు 8వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే ఈ ప్రాంతంలో పనిచేస్తాయని అధికారులు తెలిపారు. దీంతోపాటు విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న 200 సోషల్ మీడియా పోస్టులను అధికారులు తొలగించారు. నాలుగు ఖాతాలను మూసివేయించారు. మరో 16 ఖాతాలను సస్పెండ్ చేశారు.