పంజాబ్‌లో నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోని పార్టీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ (Harish rawat news) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రావత్ క్షమాపణలు తెలియజేశారు. అంతేగాక, తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గురుద్వారాలో కరసేవ చేస్తానని తెలిపారు.
అసలేం జరిగిందంటే..
పంజాబ్ కాంగ్రెస్ యూనిట్‌లో గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడిగా ఉన్న హరీశ్ రావత్ మంగళవారం చండీగఢ్‌కు వెళ్లారు. పంజాబ్ కాంగ్రెస్ భవన్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల గురించి చెబుతూ వారిని సిక్కుల పవిత్ర పదంతో పోల్చారు. దీంతో రావత్ పట్ల సిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ విమర్శలపై రావత్ బుధవారం ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు. "కొన్నిసార్లు.. మర్యాద, గౌరవాన్ని వ్యక్తపరిచే క్రమంలో కొన్ని పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. నేను అలాగే ఆ పవిత్ర పదాన్ని వాడి తప్పుచేశాను. వారి మనోభావాలను బాధపెట్టినందుకుగానూ వారికి క్షమాపణ తెలియజేస్తున్నా. సిక్కుల సంప్రదాయం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా తప్పునకు ప్రాయశ్చిత్తంగా నా రాష్ట్రంలోని గురుద్వారాలో కరసేవ చేస్తాను" అని రావత్ తెలిపారు.
- ఎఐసీసీ జనరల్ సెక్రటరీ హరీశ్ రావత్.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్‌తో బుధవారం భేటీ అయ్యారు. విద్యుత్ టారీఫ్‌లను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :'ఇస్కాన్' వ్యవస్థాపకుడి స్మారకార్థం రూ.125 నాణెం విడుదల