దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం ప్రభుత్వం. టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు ఇప్పటికే ఓసారి డ్రై రన్ నిర్వహించగా.. శుక్రవారం మరోమారు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్ నిర్వహిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్ జరగనుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి ఆయా ప్రభుత్వాలు.
736 జిల్లాల్లో...
దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో ఈ డ్రై రన్ చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 2న తొలివిడత డ్రై రన్లో మొత్తం 125 జిల్లాలలో నిర్వహించారు.
ప్రత్యేక దృష్టి పెట్టాలి..
దేశవ్యాప్తంగా రెండో దఫా వ్యాక్సిన్ మాక్ డ్రిల్ నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అదనపు చీఫ్ సెక్రటరీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. టీకా డ్రై రన్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, వ్యక్తిగతంగా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కొవిడ్-19 వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యంపై పుకార్లు, తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కో-విన్ యాప్ పనితీరుపై వివరించారు.
జనవరి 2న జరిగిన డ్రై రన్లో కనుగొన్న లోపాలను సరిదిద్దుకొని శుక్రవారం చేపట్టే డ్రై రన్‌కు సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు కేంద్ర మంత్రి. గత మాక్ డ్రిల్‌పై చాలా రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. శుక్రవారం జరిగే డ్రై రన్లో ఆసుపత్రి, బ్లాక్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి డేటాను పరీక్షించనున్నట్లు తెలిపారు.
"వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే లోటుపాట్లను గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ డ్రై రన్ ఉపయోగకరంగా ఉంటుంది. చివరి లబ్ధిదారుడి వరకు వ్యాక్సిన్ అందించేందుకు దేశవ్యాప్తంగా కోల్డ్ చైన్ విధానాన్ని మరింత పటిష్ఠం చేశాం. భారత్ పోలియో, రూబెల్లా వంటి భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టింది. టీకా పంపిణీ కోసం మానవ వనరులను బలోపేతం చేయాలి. ఇప్పటికే వివిధ స్థాయుల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాం. వ్యాక్సిన్ నేషన్ ప్రక్రియను పలు దఫాలుగా పరీక్షించాం. "
- హర్షవర్ధన్, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
తమిళనాడు పర్యటనకు హర్షవర్ధన్..
టీకా పంపిణీకి దేశం సన్నద్ధమవుతున్న క్రమంలో తమిళనాడు పర్యటనకు వెళ్లారు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. వ్యాక్సిన్ సన్నాహాలు, డ్రై రన్ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. చెన్నైలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించనున్నారు మంత్రి. దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు టీకా స్టోరేజీ కేంద్రాల్లో ఒకటైన పెరియమెడులోని జనరల్ మెడికల్ స్టోర్ డిపోట్(జీఎంఎస్డీ)కి వెళ్లనున్నారు. ఆ తర్వాత.. చెంగల్పట్టులోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి నుంచి హిదుస్తాన్ బయోటెక్‌కు వెళ్లనున్నారు.
ఇదీ చూడండి:'దేశాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చిన ఘనత మీదే'