Harnaaz Sandhu Etv Bharat interview: మిస్ యూనివర్స్‌ను ప్రకటించే సమయంలో భారతదేశం పేరును ప్రస్తావించినప్పుడు ఎంతో గర్వపడినట్టు 21ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు తెలిపింది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను అని.. 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పింది.
"అవి అద్భుతమైన క్షణాలు. విన్నర్‌ను ప్రకటించే సమయంలో నా పేరు కాకుండా.. నా దేశం పేరును చెప్పడం చాలా గర్వంగా అనిపించింది. నా దేశం పేరును ప్రస్తావించిన ప్రతీసారి గర్వపడ్డాను. 2021 మిస్ యూనివర్స్ నేనే అని తెలిసినప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యాను."
--- హర్నాజ్ సంధు, మిస్ యూనివర్స్.
ఇటీవలే.. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో 80 దేశాల నుంచి భామలు పాల్గొనగా.. వీరందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది సంధు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది. అంతకుముందు 1994 సుశ్మితా సేన్ ఈ ఘనత సాధించింది.
Harnaaz Sandhu miss universe: "పోటీలకు సిద్ధమవ్వడానికి 30రోజులే లభించింది. ర్యాంప్ వాక్, కమ్యూనికేషన్, మేకప్, డైట్, జిమ్ ట్రైనింగ్‌పై శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. నా కుటుంబసభ్యుల అండతోనే నేను గెలవగలిగాను," అని సంధు చెప్పింది.