తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయాల కోసం ఏపీ ప్రజలను గాలికొదిలేశారు: హరీశ్‌రావు - Jogipet Latest News

Harish Rao Fires on AP Ministers: ఏపీలో తమ స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు ప్రజలను గాలికి వదిలేశాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వారు తెలంగాణకు వచ్చి చూస్తే ఇక్కడ ఏముందో తెలుస్తుందని వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా అని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఇప్పుడు మాట్లాడట్లేదని ఆయన ఆరోపించారు.

Harish Rao
Harish Rao

By

Published : Apr 12, 2023, 5:34 PM IST

Harish Rao Fires on AP Ministers: మంగళవారం తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆంధ్రా మంత్రులు తెలంగాణకు వచ్చి చూస్తే ఇక్కడ ఏముందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. స్వప్రయోజనాల కోసం ఏపీలో రాజకీయ పార్టీలు పాటుపడుతున్నాయని ఆక్షేపించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడి వచ్చి చూస్తే ఏముందో వారికే తెలుస్తుంది: హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాళ్లకు రెండుచోట్ల ఓట్లు ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు. రెండు ఓట్లు ఉంటే హైదరాబాద్‌లో ఓటు ఉంచుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. దీనికి ఆంధ్రా మంత్రులు తెలంగాణలో ఏముందని అంటున్నారని చెప్పారు. వారు ఇక్కడి వచ్చి చూస్తే ఏముందో వారికే తెలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణాలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉందని.. బోరు బావుల వద్ద 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని హరీశ్‌రావు వివరించారు.

ఆడ పిల్ల పెళ్లికి కల్యాణ లక్ష్మీ.. ఎకరాకు రూ.10,000 ఇచ్చే రైతు బంధు ఉందని హరీశ్‌రావు తెలిపారు. అన్నదాత చనిపోతే రూ.5,00,000 పరిహారం ఇచ్చే రైతు బీమా ఉందన్నారు. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి.. పిల్లలకు విద్యా, పేదలకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచమే అబ్బుర పోయే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించి సాగు నీరు ఇస్తున్నామని హరీశ్‌రావు వివరించారు.

ప్రత్యేక హోదా అని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఇప్పుడు చప్పుడు చేయడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. విశాఖ ఉక్కును తుక్కుగా అమ్ముతున్నా.. స్పందన లేదని ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం ఆనాడు టీడీపీ ఎన్డీఏను వీడిందని అన్నారు. అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీతో దోస్తీ కడుతోందని పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఏపీ ప్రజలను గాలికొదిలేశారని హరీశ్‌రావు విమర్శించారు.

రాజకీయాల కోసం ఏపీ ప్రజలను గాలికొదిలేశారు: హరీశ్‌రావు

"నా వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు రాద్ధాంతం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాళ్లకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. రెండు ఓట్లు ఉంటే హైదరాబాద్‌లో ఓటు ఉంచుకోవాలని చెప్పా. తెలంగాణలో ఏముందో వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్రత్యేక హోదా అని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు మాట్లాడట్లేదు. ప్రత్యేకహోదా కోసం ఆనాడు టీడీపీ ఎన్డీఏను వీడింది. అదే టీడీపీ ఇప్పుడు బీజేపీతో దోస్తీ కడుతోంది. రాజకీయాల కోసం ఏపీ ప్రజలను గాలికొదిలేశారు." - హరీశ్‌రావు, మంత్రి

ఇవీ చదవండి:ఏపీలో ఓటు రద్దు చేసుకుని.. తెలంగాణలో తీసుకోండి: హరీశ్‌రావు

చీమలపాడు ఘటన.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అధికార, విపక్ష నేతలు

30 మంది సీఎంలలో 29మంది కోటీశ్వరులు.. జగన్ టాప్.. లాస్ట్ ఎవరంటే..

ABOUT THE AUTHOR

...view details