ఉత్తరాఖండ్‌లో ఓ మహిళా డాక్టర్ యోగాసనం ద్వారా గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. హరిద్వార్‌లో డాక్టర్ ప్రియా అహుజా అనే మహిళ ఎనిమిది భంగిమలతో కూడిన అష్టవక్రాసనాన్ని 3 నిమిషాల 29 సెకన్లపాటు వేసి ప్రపంచ రికార్డును సాధించారు. మహిళలు ఏదైనా చేయగలరు అని తెలియజేస్తూ తాను ఈ రికార్డులను బద్దలు కొట్టినట్లు వెల్లడించారు.
గతంలో అష్టవక్రాసనంలో 2 నిమిషాల 6 సెకన్ల పాటు ఉన్న గిన్నిస్ బుక్ రికార్డ్‌ను డాక్టర్ ప్రియా అహుజా బ్రేక్ చేశారు. గిన్నిస్ బుక్ వారు అన్ని రికార్డులను, ఆధారాలను పరిశీలించిన తరవాత ప్రియాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్‌ను అందించారు. అయితే తాను జూన్ 20న 4 నిమిషాల 26 సెకన్ల పాటు ఇదే ఆసనాన్ని వేశానని.. అప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు తనకు సర్టిఫికేట్ కూడా అందించారని తెలిపారు ప్రియ. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆడ, మగ, వారి వయస్సులతో సంబంధం ఉండదని.. అందులో సమయం మాత్రమే ఉంటుందని తెలిపారు. అందులో తాను 4 నిమిషాల 26 సెకన్ల రికార్డును నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో ఈ రికార్డును కూడా బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రియా అహుజా.. ఇద్దరు పిల్లల తల్లి. అయినా సరే ఏడేళ్లుగా దీనికోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తాను సాధించిన ఈ విజయం వెనుక తన కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందని తెలియజేశారు.
'హరిద్వార్‌లో ఫిట్‌నెస్, క్రీడలను ముఖ్యమంత్రి ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇతర రాష్ట్ర ప్రజలు క్రీడలు, ఫిట్‌నెస్ విషయంలో చాలా ముందున్నారు. అయినా సరే మన ఉత్తరాఖండ్‌లో దీనిపై దృష్టి సారించడం లేదు.. ఇప్పటికైనా దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి'.
-- డాక్టర్ ప్రియా అహుజా