ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ నాయకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. అతనిపై రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్.. రానియా ప్రాంత కమిటీలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యుడు జీవన్ కందుల్నా ఆకా పత్రాస్గా తెలిపారు పోలీసులు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన అనేక కేసుల్లో ఇతని పాత్ర ఉన్నట్టు చెప్పారు.
పత్రాస్ తన పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు తెలిసింది. సీపీఐ (ఎం) అభివృద్ధి వ్యతిరేక భావజాలంతో తాను విసిగిపోయానని, అందుకే లొంగిపోయినట్లు తెలిపాడు పత్రాస్. ఝార్ఖండ్ ప్రభుత్వం చేపట్టిన నక్సలైట్ల పునరావాస పథకం ప్రకారం అతనికి సాయం అందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే.. చాలా రోజులుగా పత్రాస్ లొంగిపోవటం కోసం చూస్తోన్న పోలీసులు.. ప్రస్తుత పరిణామాలను అత్యంత గోప్యంగా ఉంచారు. అతన్ని విచారణ కోసం పోలీసు కస్టడీకి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నాయి.