భారత దిగ్గజ క్రికెటర్ హర్భజన్ సింగ్.. 23ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మరి భజ్జీ భవిష్యత్ కార్యాచరణ ఏంటీ..? రాజకీయ నాయకుడిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నారా? అందుకోసమే రిటైర్మెంట్ ప్రకటించారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
హర్భజన్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం సాగుతున్నా.. ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చారు హర్బజన్. కొద్ది నెలల్లో భజ్జీ సొంత రాష్ట్రమైన పంజాబ్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అటు భాజపాకు.. ఇటు అధికార కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో ఈ రెండు పార్టీలు జనాకర్షక నేతలపై గట్టిగా దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే హర్భజన్‌ను తమ పార్టీలోకి తీసుకోవాలని ఇరుపక్షాలు బలంగా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితం భజ్జీ భాజపాలో చేరుతారనే కథనాలు కూడా వచ్చాయి. అయితే వాటిని హర్భజన్ ఖండించారు. అది ఫేక్ న్యూస్ అని ట్వీట్ చేశాడు. అయితే.. రాజకీయాల్లోకి రావట్లేదని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
సిద్ధూతో భేటీ.. ఆంతర్యమేంటీ?
Harbhajan Singh joining congress: ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసేలా ఇటీవల హర్భజన్.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సిద్ధూ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ 'సాధ్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్న ఫొటో' అని రాసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో భజ్జీ చేరిక ఖాయమనే వార్తలు వినిపించాయి. మరోవైపు.. వీటిని హర్భజన్ ఖండించకపోవడం కూడా ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చినట్లయింది.
సిద్ధూతో భేటీ జరిగిన సరిగ్గా 10 రోజుల తర్వాత భజ్జీ.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో రాజకీయాల కోసమే ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. " ఇటీవల హర్భజన్.. సిద్ధూతో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై ఆయన ఆసక్తిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లోనే నిలబెట్టాలని భావిస్తోంది" అని కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఇక, గత రెండు రోజులుగా సిద్ధూ.. భజ్జీతో టచ్‌లోనే ఉన్నారట. ఛండీగఢ్‌లోని సిద్ధూ స్నేహితుడి నివాసంలో త్వరలోనే వీరిద్దరూ మరోసారి భేటీ కానున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోనూ భజ్జీ సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలిపాయి. అవే నిజమైతే వచ్చే ఎన్నికల్లో హర్భజన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.