margadarshi chitfund : మార్గదర్శి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి ఆరోపణ ఏంటంటే... 'మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్న టికెట్స్‌కు, కంపెనీ వారు చెల్లించాల్సిన డబ్బులు కాకుండా ఈ గ్రూపునకు సంబంధం లేని సభ్యులు చెల్లించిన చందా డబ్బుతో చెల్లింపులు పూర్తిచేశారు. ఇది చట్ట ఉల్లంఘన. నియమావళి మేరకు కంపెనీ ఆధీనంలోని టికెట్స్‌కు మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ వారు, సొంత నిధులతో మాత్రమే చెల్లింపులు చేయాలి.' ఇదీ ప్రభుత్వ ఆరోపణ.
కానీ, వాస్తవం ఏంటంటే....ప్రతి ఒక్క చిట్ గ్రూపులో కంపెనీ చెల్లింపులకు సంబంధించి అత్యున్నత అకౌంటింగ్ వ్యవస్థ ‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ 2004లో జారీచేసిన సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం మాండేటరీ చిట్‌తోపాటు ఖాళీ చిట్స్‌లోనూ ఫోర్‌మన్ చందాను గుర్తించడానికి ఒక వ్యాపార విధానం ఉంది. మాండేటరీ చిట్‌తోపాటు, అవసరమైనప్పుడు ఖాళీ చిట్‌కూ ఫోర్‌మన్ చందా సమకూర్చగలిగినన్ని నిధులు బ్యాంకు ఖాతాలో ఉన్నప్పుడు, దాన్ని ఆధారంగా చేసుకొని ఖాతా పుస్తకాల్లో పద్దులు రాస్తారు. అయితే ఇక్కడ కంపెనీ అలాంటి చందా కట్టలేదన్న పరిస్థితే ఉత్పన్నం కాదు. పాడుకున్నచీటీ పాట మొత్తాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కంపెనీ ఎప్పటికప్పుడు చందాదారులకు చెల్లిస్తోంది. ఈ నిజం ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. చందాదారులు ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం జరిగినచోట చీటీ పాట మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఆ మొత్తాన్ని చిట్‌ఫండ్ యాక్ట్ 1982లోని సెక్షన్ 22(2) ప్రకారం రెండో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పదలచిన మరో విషయం ఏంటంటే... చట్టంలోని సెక్షన్ 21(1)(ఎ) కింద ఖాతా నుంచి స్థూల చిట్ మొత్తాన్ని తీసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, వ్యవస్థలో తగినంత మేర నగదు చలామణి జరగడానికి ఆ మొత్తాన్నీ సంస్థ అదే ఖాతాలోనే ఉంచుతోంది. మాండేటరీ చిట్‌తోపాటు అవసరమైతే ఖాళీ చిట్‌కు చందా సమకూర్చడానికి ఫోర్‌మన్‌కు ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఖాతా పుస్తకాల్లో చిట్ బకాయి ఉన్నట్లు నమోదు చేసినప్పుడల్లా బ్యాలెన్స్ షీట్‌లోనూ దాన్ని బకాయిగానే చూపుతారు. ఏదైనా గ్రూప్‌లోని ఖాళీ చిట్‌లో పెట్టిన పెట్టుబడిని ఆ చిట్‌లోకి కొత్త చందాదారులు చేరిన వెంటనే ఎప్పటికప్పుడు నెలవారీగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. మాండేటరీ చిట్ కాకుండా మరేదైనా చిట్ గ్రూప్ పూర్తయ్యేవరకూ భర్తీకాకపోతే, ఆ చిట్‌ను చివరి వరకూ కొనసాగించడంతోపాటు, ఆ గ్రూప్ సభ్యుల్లోని చందాదారులకు పారదర్శకంగా పూర్తిగా చెల్లింపులు జరిగిన తర్వాతే ఆ మొత్తాన్ని డ్రా చేస్తున్నారు. చివరి వరకు పెట్టుబడి పెట్టిన ఆ మొత్తాన్ని ఆ గ్రూప్ గడువు పూర్తయిన చివరి నెలలో తీసుకున్నప్పటికీ... బ్రాంచ్‌లకు నగదు ప్రవాహాన్ని బలోపేతం చేయడానికి ఆ మొత్తాన్నంతా వ్యవస్థలోనే ఉంచుతున్నారు. మాండేటరీ చీటీలు, అప్పుడప్పుడూ ఖాళీగా ఉండే చీటీలకు ఫోర్‌మన్ బ్యాంకు ఖాతాలో ఉన్న నిధుల నుంచే పూర్తిగా చందాలు సమకూరుస్తున్నారు. అందుకు సంబంధించిన పద్దులను ప్రతినెలా ఖాతా పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. ఖాళీ చీటీలలో కొత్త చందాదారులు చేరిన వెంటనే అందులో పెట్టుబడులను తిరిగి నింపడం జరుగుతోంది. అందువల్ల మాండేటరీ చిట్‌లకు, ఖాళీ చిట్‌లకు కంపెనీ చందాలు సమకూర్చడం లేదన్న ఆరోపణల్లో ఏమాత్రం పసలేదు. చిట్‌లు పాడుకున్న చందాదారులకు వారికి రావాల్సిన మొత్తాన్ని ప్రతినెలా ఎలాంటి జాప్యం లేకుండా చెల్లిస్తున్నట్లు సంపూర్ణమైన సాక్ష్యాలున్నందున ఈ ఆరోపణ పూర్తి నిరాధారం.
రెండో ఆరోపణ విషయానికొస్తే... "చిట్ కంపెనీ వారు చెల్లించాల్సిన చెల్లింపులు చేయకుండా వేరే గ్రూపునకు సంబంధించిన చందాదారుల డబ్బులను దారి మళ్లించడం వల్ల, పాటపాడుకున్న చందాదారులకు చాలా ఆలస్యంగా చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించడమైనది. చిట్ పాటదారులకు కొన్ని సందర్భాల్లో నాలుగు నెలలకు మించి చెల్లింపులు ఆలస్యం చేశారు"
వాస్తవం:బ్యాంకు ఖాతాలో నిధులు అందుబాటులో ఉండటం వల్ల కంపెనీ ఎప్పటికప్పుడు చందాలు చెల్లించి ఆ విషయాన్ని పద్దుల్లో చూపుతోంది. అందువల్ల నగదు కొరత కారణంగా, చీటీలు పాడుకున్న చందాదారులకు చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రసక్తే లేదు. ఒక చిట్ గ్రూపులోని మొత్తాన్ని మరో గ్రూప్ చెల్లింపులకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు పూర్తిగా తప్పు. చట్టం ప్రకారం వివిధ గ్రూప్ చందాదారుల నుంచి వసూలు చేసిన చందాలను ఆ శాఖలో కుదుర్చుకున్న చిట్ ఒప్పందం ప్రకారం నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. చీటీ పాడుకున్న చందాదారుకి చట్ట ప్రకారం అదే బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్‌ల వద్ద సమర్పిస్తున్నారు. చిట్‌ఫండ్ చట్టం-1982లోని సెక్షన్ 22(2) ప్రకారం చిట్ పాట మొత్తాన్ని బ్యాంకు ఖాతా నం.1 నుంచి చెల్లించినప్పుడు, అలాగే ఖాతా నం.2కి జాగ్రత్తగా బదిలీ చేసినప్పుడు ఒక గ్రూప్‌కి చెందిన చందా మొత్తాలను మరో గ్రూప్‌లో పాడుకున్న చీటీదారుల చెల్లింపులకు ఉపయోగించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరైనా చందాదారుడు పాట పాడుకున్నప్పుడు అతను భవిష్యత్తులో చెల్లించాల్సిన చందా మొత్తానికి సెక్యూరిటీ సమర్పించమని అడిగే హక్కును చట్టంలోని సెక్షన్ 21(1) ఫోర్‌మన్‌కు కల్పిస్తోంది.
ఇలాంటి సమయంలో చందాదారులు భవిష్యత్తులో చెల్లించాల్సిన బకాయిలను మినహాయించుకోమని కోరడంతోపాటు ష్యూరిటీలు / గ్యారంటీలు, సెక్యూరిటీ మొత్తాలు, ఎల్‌ఐసీ తనఖా, బ్యాంకు గ్యారంటీలు, ఆస్తుల తనఖా పెట్టడంలాంటివి చేస్తుంటారు. వాళ్లు భవిష్యత్తులో చెల్లించాల్సిన మొత్తానికి వీటిని సమర్పిస్తుంటారు. ఇలాంటి సమయంలో కంపెనీ తనకున్న హక్కులను ఉపయోగించుకొని సదరు చందాదారు సమర్పించిన ష్యూరిటీల్లోని బలాబలాలను పరిశీలించుకుంటుంది. ఆ గ్రూప్‌లోని చీటీలు పాడుకోని చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ పనిచేస్తుంది. అది అవసరం కూడా. చీటీ పాడుకున్న చందాదారు తగిన సెక్యూరిటీ సమర్పించిన తక్షణం చెల్లింపులు చేస్తున్నారు. చీటీ పాడుకున్న చందాదారు ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం చేస్తే, వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని తదుపరి వాయిదా చెల్లించడానికి ముందే చట్టప్రకారం ఆమోదించిన ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేసి, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న వివరాలను సదరు చందాదారుతోపాటు, రిజిస్ట్రార్‌కూ లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఆరోపిస్తున్నట్లుగా ఎలాంటి జాప్యం జరగడంలేదు. చీటీ పాడుకున్న మొత్తానికి సరిపడా అవసరమైనంత సెక్యూరిటీ కోరే హక్కు కంపెనీకి ఉంది. ఈ విషయంలో కంపెనీ చట్టంలోని నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తోంది.
ఆరోపణ 3: నూతన చిట్ ప్రారంభించే సమయంలో తగు అనుమతులు పొందకుండా చిట్ మెంబర్స్ నుంచి ఎలాంటి మొత్తాలు స్వీకరించకూడదు. కానీ చిట్‌ఫండ్ నియమావళిని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పబ్లిక్ నుంచి నిధులు స్వీకరించడం జరిగింది.
వాస్తవం: చిట్‌ఫండ్స్ చట్టం 1982లోని సెక్షన్ 4 ప్రకారం ప్రీవియస్ శాంక్షన్ ఆర్డర్ (పీఎస్‌ఓ) స్వీకరించిన తర్వాతే కంపెనీ చందాదారుల పేర్లను నమోదు చేసుకుంటోంది. అలా నమోదు చేసుకున్న చందాదారు తన స్వీయ విచక్షణ మేరకు వేలంపాటకు ముందు చందా మొత్తాన్ని చెల్లిస్తారు. కొన్ని సమయాల్లో చందాదారు ముందస్తుగానే చందా మొత్తాన్ని చెల్లిస్తుండొచ్చు. చందాదారులు స్వీయ సౌకర్యార్థం చెల్లిస్తే తప్ప కంపెనీ ఎప్పుడూ తొలి వాయిదాకంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించమని చందాదారుడిని కోరదు. అలా వచ్చిన చందాలన్నింటినీ ఖాతా పుస్తకాల్లో ప్రత్యేకంగా ముందస్తు చందాలుగా రాయడంతోపాటు, బ్యాలన్స్‌షీట్‌లో వాటిని బకాయిలు అన్న హెడ్ కింద చూపుతోంది. ప్రారంభానికి ముందే చందా మొత్తాన్ని స్వీకరించకూడదని చిట్‌ఫండ్స్ చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. దాన్ని నిరోధించే నిబంధన కూడా ఎక్కడా లేదు. అయితే కంపెనీ ప్రతిష్ఠను దిగజార్చడానికి రిజిస్ట్రార్లు ఊహాజనితమైన, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
ఆరోపణ 4: చిట్ గ్రూపులోని చందాదారులు వారి అవసరాలకు చిట్ పాట పాడుకోగా, వారికి సకాలంలో చిట్ మొత్తాన్ని చెల్లించకుండా చిట్ నిబంధనల పేరుతో సరైన హామీలను (సెక్యూరిటీ) సమర్పించలేదనే కారణంతో, వడ్డీ ఆశ చూపించి భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాకు హామీగా (సెక్యూరిటీగా) చిట్ మొత్తాన్ని కంపెనీ వద్దే డిపాజిట్ చేసుకుని 4% లేదా 5% వడ్డీ చెల్లిస్తామని రశీదులు ఇచ్చి ఎలాంటి మొత్తాలు చిట్ పాడుకున్న వారికి చెల్లించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.