Har Ghar Tiranga 2023 : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పౌరులు 'హర్‌ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగం కావాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశం నలుమూలలా తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని యువత, ఉద్యోగులు ర్యాలీల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్వతంత్ర్య యోధులను స్మరించుకుంటూ దేశ భక్తిని చాటుకుంటున్నారు. జమ్ముకశ్మీర్ రంబన్ జిల్లాలో త్రివర్ణ పతకాలు చేతబూని బుద్గామ్ స్టేడియం నుంచి బస్టాప్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీనగర్‌లో రాష్ట్ర గవర్నర్ మనోజ్ సిన్హా.. ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజౌరీలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరంగా ర్యాలీని జయప్రదం చేశారు.
Independence Day 2023 :దిల్లీలో తిరంగా ర్యాలీని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి జెండా ఊపి ప్రారంభించారు. అమృత్‌కాల్‌లో స్వాతంత్ర్య సమర యోధులు కన్న కలలను నిజం చేద్దామని ఈ సందర్భంగా మీనాక్షి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వందేమాతరం, భారత్ మాతాకి జై అంటూ త్రివర్ణ పతాకాలను పట్టుకుని పరుగులు తీశారు.
Har Ghar Tiranga Campaign :గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో భద్రతా సిబ్బంది సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాతో కవాతు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛతార్‌పుర్‌లో ప్రజలు తిరంగా ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నారు. రహదారులపై దేశ భక్తి గీతాలను పాడుకుంటూ.. నడక సాగించారు. అటు విద్యార్థులు భారీ ఎత్తున మువ్వన్నెల జెండాలు పట్టుకుని ర్యాలీలు చేశారు
డీపీ మార్చాలని మోదీ పిలుపు
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పౌరులంతా సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రొఫైల్, డిస్‌ప్లే పిక్చర్‌లలో 3 రంగుల జాతీయ జెండాను ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమానికి మద్దతు ఇచ్చేందుకు అందరూ తమ డీపీలను మార్చాలని వివరించారు. 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమం స్ఫూర్తితో సోషల్ మీడియా ఖాతాల డీపీని మారుద్దామన్న మోదీ.. ప్రియమైన దేశానికి మనకు మధ్య గల బంధాన్ని మరింతగా పెంచే ఈ విశిష్ట ప్రయత్నానికి మద్దతిద్దామని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కూడా ఆయన డీపీని ట్విటర్‌లో మార్చేశారు. స్వేచ్ఛ, జాతీయ ఐక్యతకు జాతీయ జెండా ప్రతీకన్న మోదీ.. హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో తిరంగాతో ఉన్న తమ ఫోటోలను అప్‌లోడ్ చేయాలని ప్రజలకు సూచించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రధాని ఇప్పటికే ప్రజలను కోరారు.