తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ రోగికి తెగిన చేయిని అతికించిన వైద్యులు - ముంబయి జేజే ఆస్పత్రి వైద్యులు

అసలే కొవిడ్​ రోగి.. దానికి తోడు తెగిపడిన చేయి.. ఈ పరిస్థితుల్లో సదరు రోగికి తెగిన చేతిని తిరిగి అతికించాలంటే ఏ వైద్యులకైనా పెద్ద సవాలే. కానీ, ముంబయిలోని జేజే ఆసుపత్రి వైద్యులు.. ఈ సవాలును స్వీకరించారు. విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి, అతడికి కొత్త జీవితాన్ని అందించారు.

Hand of Covid patient reattached
కొవిడ్​ రోగికి తెగిన చేయిని అతికించిన వైద్యులు

By

Published : Apr 28, 2021, 9:13 PM IST

ముంబయి జేజే ఆసుపత్రి వైద్యుల అరుదైన ఘనత

ముంబయిలోని జేజే ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఓ కొవిడ్​ రోగికి తెగిన చేతిని విజయవంతంగా అతికించారు. వైద్యుల కృషి ఫలితంగా ఆ వ్యక్తి ఇప్పుడు కొత్త జీవితం లభించింది. డాక్టర్ చంద్రకాంత్​ ఘార్వాడే, డాక్టర్​ యోగేశ్​ జైశ్వాల్​ ఈ సర్జరీని పూర్తి చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అజిత్​ కుమార్​ అనే వ్యక్తి.. ముంబయిలోని బైకుల్లా రైల్వే స్టేషన్​ వద్ద మార్చి 16న ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతని చేయి తెగిపోయింది. దాంతో అతణ్ని జేజే ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్య నిపుణులు.. 11 గంటలపాటు శ్రమించి అతడికి సర్జరీ చేశారు. చేతి నరాలను, కండరాలను, చర్మాన్ని విజయవంతంగా అతికించారు.

ఆ గాయాల నుంచి అజిత్​ కుమార్​ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తన చేతిని, తన జీవితాన్ని కాపాడిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్పేందుకు అతడి వద్ద మాటలు కరవయ్యాయి.

సర్జరీ ఎలా జరిగింది? డాక్టర్లేమన్నారు...?

అజిత్​ కుమార్​ను తమ ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు.. డీన్​ మంకేశ్వర్, సూపరింటెండెంట్​ డాక్టర్​ సూరారే.. జీటీ ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించారని డాక్టర్​ చంద్రకాంత్​ ఘార్వాడే తెలిపారు. అక్కడ అతనికి యాంటీజెన్ పరీక్ష​ నిర్వహించగా నెగెటివ్​గా తేలిందని చెప్పారు.

"శరీరంలో నుంచి ఏ అవయవమైనా విడిపోయిన తర్వాత మొదటి ఆరు గంటలు అత్యంత కీలకం. దాన్ని గోల్డెన్​ అవర్​ అని చెప్పవచ్చు. అజిత్​ కుమార్ చేతిలో తెగిన నరాలను అతికించడానికి వీలుగా కాలు నుంచి ఓ నరాన్ని తీసుకున్నాం. దానికి ఆరు గంటలు పట్టింది. అప్పుడు కండరాలను జతచేశాం. కడుపు చర్మం నుంచి కొంత భాగాన్ని తీసుకుని, చేతి మీద చర్మంలా అతికించాం. ఈ సర్జరీ చేయడానికి మొత్తం 11 గంటలు పట్టింది. సర్జరీ పూర్తైన తర్వాత గంటకోసారి అతణ్ని పరీక్షిస్తూ వచ్చాం.

ఈ క్రమంలో అతడి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అప్పుడు.. ఆర్​టీ-పీసీఆర్​ టెస్టు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దాంతో కొవిడ్ చికిత్స నిమిత్తం అతడ్ని సెయింట్​ జార్జ్ ఆసుపత్రికి తరలించాం. జేజే ఆసుపత్రి వైద్య బృందం.. ప్రతిరోజు అతణ్ని పరీక్షించేందుకు, డ్రెస్సింగ్​ చేసేందుకు ఆ ఆసుపత్రికి వెళ్లేది. అజిత్​ కుమార్​ను మానసికంగా దృఢంగా ఉంచేందుకు అతడి మాతృభాషలోని పాటలను మేం పెట్టేవాళ్లం."

-డాక్టర్​ చంద్రకాంత్​ ఘార్వాడే

అజిత్​ తన చేతిని పూర్తిగా కదిపేందుకు మరిన్ని సర్జరీలు అవసరమవుతాయని డాక్టర్​ ఘార్వాడే తెలిపారు. ఇందుకోసం తాము మరో 2- 3 ఆపరేషన్లు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తి చేయడంలో పూర్తి బృందం కృషి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అంబులెన్సులో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకు- రోగి మృతి

ఇదీ చూడండి:కరోనాను ఎదుర్కొనే నోటి మాత్రపై ఫైజర్‌ దృష్టి!

ABOUT THE AUTHOR

...view details