తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాసవాన్​ మృతిపై దర్యాప్తునకు మాంఝీ డిమాండ్​

లోక్​జన్​శక్తి పార్టీ నేత రామ్​ విలాస్​ పాసవాన్​ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని హిందుస్థానీ అవామ్ మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. పాసవాన్​ అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజు.. ఆయన కుమారుడు చిరాగ్​ వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.

paswan
రామ్​ విలాస్​ పాసవాన్

By

Published : Nov 2, 2020, 2:31 PM IST

కేంద్రమంత్రి రామ్​విలాస్ పాసవాన్​ మృతిపై హిందుస్థానీ అవామ్​ మోర్చా (హెచ్​ఏఎం) అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. పాసవాన్ కుమారుడు, ఎల్​జేపీ అధినేత చిరాగ్ పాసవాన్​ తీరుపై సందేహాలు ఉన్నాయని తెలిపింది.

"పాసవాన్​ మృతితో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. కానీ, ఆయన అంత్యక్రియలు జరిగిన మరుసటిరోజు జరిగిన వీడియో చిత్రీకరణలో చిరాగ్​ నవ్వుతూ కనిపించారు. షూటింగ్​ చేసే విధానంపై ఆయన మాట్లాడుతూ కనిపించారు. చిరాగ్​ తీరుతో రామ్​ విలాస్​ అనుచరులు, బంధువుల్లో అనుమానాలు మొదలయ్యాయి."

- హిందుస్థానీ అవామ్ మోర్చా

"ఎవరి ఆదేశాలతో రామ్​విలాస్​ చేరిన ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు? ఎవరు చెబితే ఆసుపత్రిలో పాసవాన్​ను కలిసేందుకు ముగ్గురిని మాత్రమే అనుమతించారు? ఆయన మృతిపై ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి." అని హెచ్​ఏఎం లేఖలో పేర్కొంది.

ఖండించిన చిరాగ్​..

ఇలాంటి ఆరోపణలు చేసేవారు సిగ్గుపడాలని తీవ్రంగా స్పందించారు చిరాగ్​. హెచ్​ఏఎం అధినేత జీతన్​ రామ్ మాంఝీకి తన తండ్రి ఆరోగ్యం గురించి చెప్పానని, అయినా ఆయన చూడటానికి రాలేదని చెప్పారు. తన తండ్రి మృతిపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

వీడియో వైరల్​..

ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న పాసవాన్​.. అక్టోబర్​ 8న కన్నుమూశారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. పాసవాన్​ ఫొటో ఎదుట చిరాగ్​ మాట్లాడుతున్నట్లు ఫొటో షూట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఫొటోగ్రాఫర్​కు సూచనలు ఇస్తున్న చిరాగ్​ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

విమర్శలు..

తన తండ్రి గురించి మాట్లాడేటప్పుడు చిరాగ్​ బాధపడలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శించాయి. అయితే, తన తండ్రి విషయంలో తానెంత బాధపడ్డాననే విషయాన్ని ఎవరికీ రుజువు చేయాల్సిన అవసరం తనకు లేదని చిరాగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​ ఇలాంటి తక్కువ స్థాయి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని మండిపడ్డారు.

ఇదీ చూడండి:'నా గుండెలు చీల్చి చూడండి.. మోదీ కనిపిస్తారు'

ABOUT THE AUTHOR

...view details