AP Education Minister Botsa Satyanarayana comments: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3వ (సోమవారం) తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయని.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..''ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులను ప్రకటిస్తున్నాం. ప్రత్యేక కారణం ఉంటే తప్ప నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించం. హాల్ టికెట్ ఆధారంగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాము. గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్ వెనక్కి తీసుకున్నాం. తహశీల్దార్ కార్యాలయాల్లో ఉంచాలన్న సర్క్యులర్‌ను కూకడా వెనక్కి తీసుకున్నాం. ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదు.'' అని ఆయన అన్నారు.
మూడు రాజధానులపై మరోసారి స్పష్టత: అనంతరం మూడు రాజధానులు అనే అంశం వైసీపీ పార్టీ, ప్రభుత్వ విధానమని.. మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని నిలదీశారు. మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళతామని ఆయన తేల్చి చెప్పారు. న్యాయ చిక్కులు, ఇతరత్రా సాంకేతిక సమస్యలు లేకుంటే.. రేపటి నుంచే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని అనుకుంటున్నామని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
పట్టభద్రుల ఎన్నికల్లో తప్పెక్కడ జరిగిందో సమీక్షిస్తాం: ఊరంటే స్మశానమూ ఉంటుందని.. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో స్మశానం అన్నానని ఆయన వివరించారు. నివాసయోగ్య ప్రాంతమూ ఉంది కాబట్టే ఇప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలను ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు అనేవి సహజమన్న ఆయన... పట్టభద్రుల ఎన్నికల్లో తప్పెక్కడ జరిగిందో సమీక్షించుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో తమ అభ్యర్థి ఓటమి తన వైఫల్యంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ రాజధాని సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మలేదనే వాదనతో ఏకీభవించనని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.