ప్రస్తుతం అంతరించిపోయే జాబితాలో ఉండే హలరీ జాతి గాడిదలకు రక్షించేందుకు గుజరాత్లోని రాజ్కోట్ ప్రజలు ముందుకు వచ్చారు. వీటి సంఖ్యను పెంచేందుకు అక్కడ ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. బిడ్డలకు ఎలా ఫంక్షన్లు చేస్తారో.. అప్పుడే జన్మించిన గాడిద పిల్లకు, గర్భందాల్చిన గాడిదలకు సీమంతం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం ఉప్లేటా తాలూకా కోల్కి గ్రామంలో ఓ ఆడ గాడిద మరో పిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఈ బిడ్డ పుట్టడం వల్ల అక్కడ ప్రజలు ఆనందంతో మునిగితేలారు. ఆ ప్రాంతంలోని పశువుల కాపరులు, ప్రజలు ఆ బిడ్డకు బారసాల వేడుకతో పాటుగా.. గర్భం దాల్చిన 33 గాడిదలకు సీమంతం చేశారు. మనుషులకు చేసిన విధంగానే.. వారంతా కలిసి ఆ పిల్లను శుభ్రం చేసి.. అందంగా అలంకరించారు. దీంతో పాటుగా గర్భం దాల్చిన వాటి.. నుదుటిన ఎర్రటి తిలకం దిద్ది, వీపుపై ఎర్రటి వస్త్రాలు కప్పారు. ఆ తర్వాత మహిళలు అనేక పూజలు చేసి.. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందించారు.
గర్భం దాల్చిన హలరీ గాడిదలు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామస్థులు, జంతు ప్రేమికులు తరలివచ్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని తిలకించడం కోసం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా పాల్గొన్నారు. ప్రజలంతా ఆనందంతో మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ హలరీ గాడిదల సంఖ్య దాదాపు 417 మాత్రమే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వీటి సంఖ్యను పెంచేందుకు గతేడాది నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు అక్కడ ప్రజలు వెల్లడించారు. దీనిలో భాగంగా స్థానికంగా ఉండే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నట్లు తెలిపారు.
గర్భం దాల్చిన హలరీ గాడిదలకు సీమంతాలు చేస్తున్న ప్రజలు అసలేంటీ 'హలరీ' గాడిద..?
స్వదేశీ జాతి అయిన 'హలారీ' గాడిద.. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ గాడిదల్లా కాకుండా తెల్లరంగులో మాత్రమే ఉంటాయి. మామూలు గాడిదల కంటే బలంగాను, కొంత ఎత్తుగాను ఉండి.. ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగపడుతాయి. దీంతో పాటుగా ఈ జాతి గాడిద పాలను సౌందర్య సంరక్షణలో ఉపయోగిస్తారు. దీంతో వీటి పాలకు అధిక డిమాండ్ ఉంది. వీటి పాల ధర లీటరుకు రూ.180 వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ జాతి అంతరించి పోయే జాబితాలో చేరింది.