HAL BEL deal: ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సాహించే దిశగా మరో ముందడుగు వేశాయి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్). తేలికపాటి యుద్ధ విమానాలు(ఎల్సీఏ) తేజస్ ఎంకే1ఏ ప్రోగ్రామ్ కోసం 20 రకాల వ్యవస్థల అభివృద్ధి, సరఫరా చేసేందుకు హెచ్‌ఏఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 2023 నుంచి 2028 వరకు ఐదేళ్ల కాలానికి జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.2,400 కోట్లు. ఇప్పటివరకు ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. క్రిటికల్ ఏవియానిక్స్ లైన్ రీప్లేసబుల్ యూనిట్లు (ఎల్యూఆర్ఎస్), విమాన నియంత్రణ కంప్యూటర్లు, నైట్ ఫ్లయింగ్ ఎల్యూఆర్లను సరఫరా చేయడం ఈ ఒప్పందంలో కీలక అంశాలు.
Tejas mk1a HAL
"ఎల్సీఏ తేజస్ ప్రోగ్రామ్.. హెచ్‌ఏఎల్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ), బీఈఎల్ వంటి భారతీయ రక్షణ సంస్థల మధ్య సమన్వయానికి అద్భుతమైన ఉదాహరణ. తేజస్ ఎంకే1ఏకు 20 రకాల క్రిటికల్ ఏవియానిక్స్ ఎల్ఆర్యూలు అభివృద్ధి, సరఫరా కోసం.. ఆత్మనిర్భర్ భారత్ ప్రోత్సహించే దిశగా ప్రస్తుత ఒప్పందం జరిగింది. స్వదేశీ ఉత్పత్తులకు హెచ్‌ఏఎల్ కట్టుబడి ఉంది" అని హెచ్‌ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ పేర్కొన్నారు.
'ప్రతిష్టాత్మక ఎల్సీఏ తేజస్ ప్రోగ్రామ్ కోసం హెచ్‌ఏఎల్ నుంచి ఆర్డర్ పొందినందుకు సంతోషంగా ఉంది. హెఏఎల్తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి ఎదురుచూస్తున్నాం' అని బీఈఎల్ సీఎండీ ఆనంది రామలింగమ్ అన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన నియంత్రణ కంప్యూటర్లు, ఎయిర్ డేటా కంప్యూటర్లను వైమానికి దళానికి సరఫరా చేయనుంది బెల్. ఈ సిస్టమ్స్ డీఆర్డీఓ, ఎరోనాటికల్ అభివృద్ధి ఏజెన్సీలకు చెందిన వివిధ ల్యాబ్‌లలో రూపొందించారు.