మధ్యప్రదేశ్ రాజదాని భోపాల్‌లోని చారిత్రక హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌ను(Habibganj station) రాణీ కమలాపతి రైల్వేస్టేషన్‌గా పేరు మార్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సమ్మతితో రాష్ట్రంలో అధికారిక గెజిట్ విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. గోండు వర్గం నాయకురాలిగా, భోపాల్‌లో చిట్ట చివరి హిందూ రాణిగా పేరొందిన కమలాపతి(Gond Queen Kamlapati) పేరును రాష్ట్రంలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు పెట్టుకోవడం గర్వకారణమన్నారు.
హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్(Rani Kamlapati railway station) పేరును మార్చుతూ ప్రకటన చేసిన క్రమంలో భోపాల్‌లోని భాజపా కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు నేతలు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. టపాసులు పేల్చి వేడుకలు నిర్వహించారు.