Gyanvapi Supreme Court Verdict : జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఏఎస్ఐకి శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సర్వేను 'నాన్-ఇన్వేసివ్ టెక్నిక్'లో కొనసాగించాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వాదనలు విన్న జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం.. మసీదు నిర్మాణాన్ని ధ్వంసం చేసేలా సర్వేలో ఎలాంటి పరికరాలను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
Gyanvapi Mosque Supreme Court : 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపి మసీదులో.. వజూఖానా మినహా మిగతా ప్రాంగణమంతా సర్వే జరిపి.. హిందూ ఆలయం స్థానంలో మసీదును నిర్మించారా? లేదా? అనే విషయాన్ని నిర్ధరించాలని వారణాసి జిల్లా ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో అలహాబాద్ హైకోర్టు కూడా ఏకీభవించింది. మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వే కొనసాగించేందుకు అనుమతించింది. దీంతో శుక్రవారం ఉదయం పురావస్తు శాఖ అధికారులు సర్వే చేపట్టారు.
Gyanvapi High Court : అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం శనివారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. ప్రార్థనా ప్రదేశాల చట్టాలను ఉల్లంఘిస్తూ ఏఎస్‌ఐ.. 500 ఏళ్ల నాటి చరిత్రను తిరగదోడాలని చూస్తోందని వాదించింది. ఇలా చేస్తే గత గాయాలను మళ్లీ తెరిచినట్టే అని ధర్మాసనానికి నివేదించింది. ఏఎస్‌ఐ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టడం లేదని, నిర్మాణాలకు ఎలాంటి విధ్వంసం జరగదని హామీ ఇచ్చారు.
సర్వే పూర్తికి అదనపు గడువు..
Gyanvapi Case Varanasi Court : జ్ఞాన్వాపి మసీదుపై శాస్త్రీయ సర్వేను పూర్తి చేసేందుకు ఏఎస్ఐకు.. వారణాసి కోర్టు శుక్రవారం అదనంగా నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు ఏఎస్‌ఐ పిటిషన్ను విచారించిన జిల్లా జడ్జి ఏకే విశ్వేష.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 4 వరకు గడువు పొడిగించినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మోహన్ యాదవ్ తెలిపారు.