Gyanvapi Mosque ASI Survey : ఉత్తర్‌ప్రదేశ్.. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పటిష్ఠ బందోబస్తు మధ్య ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు సర్వే మొదలైందని ఏఎస్ఐ వర్గాలు తెలిపాయి. మసీదుకు సంబంధించిన చట్టపరమైన వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్ల ప్రతినిధులతో పాటు ఏఎస్ఐ బృందం కాంప్లెక్స్ లోపలికి వెళ్లింది. అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు శాస్త్రీయ సర్వేను బహిష్కరించారు.
భద్రత కట్టుదిట్టం
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయడంపై హిందూ పక్షాల తరఫు న్యాయవాది సోహల్ లాల్ ఆర్య స్పందించారు. ముస్లిం పక్షం ఏఎస్ఐ సర్వేను బహిష్కరించిందని తెలిపారు. తాను మసీదులో జరిగే శాస్త్రీయ సర్వేలో పాల్గొంటానని అన్నారు. కాగా.. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ సర్వే చేపట్టడం అవసరమని వ్యాఖ్యానించింది.
Gyanvapi Masjid Supreme Court Judgement : కాగా.. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ.. గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 370 కేసు విచారణ జరుపుతున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం వద్ద న్యాయవాది నిజాం పాషా.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. అత్యవసర విచారణ కోసం మెయిల్ చేశామని, ఏఎస్ఐ సర్వే చేయకుండా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను కోరారు. మెయిల్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని సీజేఐ తెలిపారు. మరోవైపు, తమ వాదనలు వినకుండా జ్ఞానవాపి మసీదు విషయంలో ఆదేశాలు జారీ చేయవద్దని.. హిందూ పక్షాల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.
సర్వే జరపాలని పిటిషన్..
ASI Survey Of Gyanvapi Mosque : మొఘలుల కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి నిర్ధరించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు.. వారణాసి జిల్లా కోర్టులో ఈ ఏడాది మే 16న పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను(ఏఎస్ఐ) ఆదేశించింది. ఏఎస్ఐ అధికారుల బృందం జులై 24న సర్వే ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది.
ఈ నేపథ్యంలోనే వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్‌ఐకి అనుమతినిచ్చింది.