Gyanvapi Case Court Verdict Today :జ్ఞానవాపి మసీదు స్థానంలో గతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్దరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ కొట్టివేయాలని దాఖలు చేసిన 5 పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. 1991లో వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్ అనుమతించతగినదే అని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పు ఇచ్చారు. వారణాసి కోర్టులో ఉన్న పిటిషన్‌ను ప్రార్థనా స్థలాల చట్టం-1991 నిరోధించలేదని స్పష్టంచేశారు.
జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు కాశీ విశ్వనాథ్ ఆలయంలో భాగమేనని అక్కడ మసీదు నిర్మించారని కాబట్టి మళ్లీ ఆలయం పునరుద్దరించాలని హిందువులు వారణాసి కోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన వారణాసి కోర్టు 2021 ఏప్రిల్ 8న జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ-AIMC, ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంటర్ల్ వక్ఫ్ బోర్డ్ హైకోర్టులో 5 పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ జరిపిన అలాహాబాద్ హైకోర్టు ఐదు పిటిషన్లను కొట్టి వేసింది. మసీదు స్థానంలో ఆలయం పునరుద్దరించాలని దాఖలైన పిటిషన్లపై ఆరు నెలల్లో విచారణ పూర్తిచేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది.